తెలంగాణలో అకాల వర్షాలకు పాడైన పంటలు

Telugu Lo Computer
0


జనవరిలో ఉరుముల్లేని పిడుగులా వచ్చిపడ్డ అకాల వర్షాలు... కర్షకులను నష్టాల పాలుచేశాయి. రెండు మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురుస్తున్నా... మంగళవారం రాత్రి పడిన వానలు వరంగల్ జిల్లా రైతుల్ని పుట్టిముంచాయి. వరంగల్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన... అందరికీ కన్నీళ్లనే మిగిల్చింది. దాదాపు రెండు గంటలకు పైగా ఈదురుగాలులతో... వర్షం పడింది. దీంతో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నర్సంపేట పరిధిలో దాదాపు 280 ఇళ్లు దెబ్బతిన్నాయి. వర్షం ధాటికి ఇంట్లో బియ్యం, దుస్తులు, వస్తువులు తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాన ఉద్ధృతికి నర్సంపేట పరిధిలోనూ పంట చేనుల్లోకి నీళ్లు వచ్చాయి. జిల్లాలో మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. వడగళ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనూ సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిరపకాయలు రాలి వరదలో కొట్టుకుపోయాయి. చిట్యాల, టేకుమట్ల, మహదేవపూర్, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిచింది. రేగొండకి చెందిన బందెల్లి అనే రైతు ఐదెకరాల మిర్చి పంట వానకు కొట్టుకుపోగా... అది చూసిన రైతు అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక రైతులు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికి కోలుకున్నాడు. తామర, ఇతర తెగుళ్ల కారణంగా ఇప్పటికే కొంతమేర నష్టపోగా... వడగళ్ల కారణంగా మిగత పంట నాశనమైందని మిరపరైతులు వాపోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)