ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో  తన బలాన్ని మరింత పెంచుకోనుంది. తన గళాన్ని మరింత బలంగా వినిపించాలనుకుంటుంది. ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగూ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్టే. దీనితో పెద్దల సభలో వైసీపీకి ఉన్న బలం 10కి చేరుతుంది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి, భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు ఈ ఏడాదే రాజ్యసభ నుంచి రిటైర్ కానున్నారు. ఈ నలుగురిలో విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభ రీ నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 21వ తేదీతో ఆరు సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వ కాల పరిమితి ముగుస్తుంది. 2016లో వైఎస్ఆర్సీపీ తరఫున సాయిరెడ్డి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ తరఫున పెద్దల సభకు పంపించింది. అప్పట్లో బీజేపీతో ఉన్న పొత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం సురేష్ ప్రభును కూడా ఏపీ నుంచే నామినేట్ చేసింది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ పార్టీ ఫిరాయించారు. బీజేపీ కండువాను కప్పుకొన్నారు. బీజేపీ సభ్యులుగానే రిటైర్ కానున్నారు. ఆ ముగ్గురి కాలపరిమితి ముగియడం వల్ల ఏర్పడే ఖాళీలు వైసీపీ ఖాతాలోనే వెళ్లనున్నాయి. విజయసాయి రెడ్డిని రీ నామినేట్ చేయడంతో పాటు- వైసీపీ అగ్ర నాయకత్వం మరో ముగ్గురు కొత్తముఖాలను పెద్దల సభకు పంపిస్తుంది. దీనితో వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆరు నుంచి 10కి పెరుగుతుంది. ప్రస్తుతం విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నథ్వాని.. వైసీపీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. సాయిరెడ్డిని రీనామినేట్ చేస్తే.. మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని వైసీపీ నాయకత్వం ఎవరిని పంపిస్తుందనేది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)