20 కోట్ల ఏండ్ల తర్వాత మహాభారత్‌?

Telugu Lo Computer
0


తూర్పు ఆఫ్రికా దేశాలైన సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్‌తో పాటు మడగాస్కర్‌ దేశాలు 20 కోట్ల సంవత్సరాల్లో భారత భూభాగంతో కలిసిపోతాయని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ దేశాలు భారత పశ్చిమ తీరాన్ని తాకడం వల్ల తీరం వెంబడి పొడవైన పర్వత శ్రేణి ఏర్పడుతుందని తెలిపింది. ఈ పర్వత శ్రేణికి సోమాలయా అని పేరు కూడా పెట్టింది. నెదర్లాండ్స్‌లోని యూట్రెక్ట్‌ యూనివర్సిటీ సైంటిస్టు డూవీ వాన్‌ హిన్‌బెర్జెన్‌ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. ఈ వివరాలను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ప్రచురించారు. కాలక్రమంలో సీషెల్స్‌, మారిషస్‌ దీవులు అన్నీ కలిసిపోతాయని చెప్పారు. ఇవి తాకడం వల్ల లక్ష దీవులు హిమాలయాల్లాగా 8 కిలోమీటర్ల ఎత్తుతో పర్వతాలుగా మారుతాయని పేర్కొన్నారు. ముంబై నగరం సోమాలయ పర్వత శ్రేణి పాదాల వద్ద ఉంటుందన్నారు. ఖండచలన సిద్ధాంతం ప్రకారం గతంలో ఒకే ఖండంగా ఉన్న ఈ భూమిలో అంతర్గత పలకల్లో కదలికలతో ఖండాలుగా విడిపోయింది. అవి ఇంకా కదులుతూనే ఉన్నాయి. ఈ కదలికల్లో భాగంగానే ఆఫ్రికా దేశాలు భారత్‌ వైపు కదులుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. పైన పేర్కొన్న దేశాలకు, ఆఫ్రికా ఖండానికి మధ్య ఇప్పటికే లోయలు ఉద్భవించాయని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)