సూరపనేని శ్రీధర్

Telugu Lo Computer
0


సూరపనేని శ్రీధర్  తెలుగు సినిమా నటుడు. మూడు దశకాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో సుమారు 150 సినిమాలలో నటించిన శ్రీధర్ తెలుగు సినిమా రంగములో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్, తల్లా? పెళ్లామా? చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని 1964లో హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వ పనుల శాఖలో గుమాస్తాగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళుతూ బి.ఏ పూర్తిచేశారు. కళాశాల సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యారు. పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈయన ప్రధానపాత్ర పోషించిన మంచుతెర అనే నాటకానికి గాను ఆంధ్ర నాటక కళా పరిషత్ యొక్క ద్వితీయ బహుమతి అందుకున్నారు. ఒకప్పుడు ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలన్నింటిలోనూ శ్రీధర్ కనిపించేవారు. జస్టిస్ ఛౌదరి సినిమాలో ఎన్టీ రామారావు కొడుకుగా నటించారు. ప్రతిభావంతమైన కళాకారుడైన శ్రీధర్ ఏనాడు వేషాలకోసం అర్ధించలేదు. తనకు అవకాశం వచ్చిన సినిమాలలో నటించారు. నటుడిగా ఉండగా ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులతో, తన చివరి దశకంలో ఆ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు. ఆయనకు టివి సీరియళ్లు అవకాశం వెతుక్కుంటూ వస్తే అందులో నటించడానికి ఇష్టపడలేదు. ఆ సీరియళ్లు నటిస్తే శ్రమ ఎక్కువ తప్పితే ఆర్థికంగా ఫలితాలు బహు తక్కువ అని తెలుసుకుని నటనకు దూరంగా ఉన్నారు. స్వంత చిత్ర నిర్మాణాలపై ఆసక్తి కనబరచలేదు. హీరో వేషాలు వస్తున్నప్పుడు శ్రీధర్‌చే ఎన్‌టిఆర్‌ తన స్వంత చిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. దాంతో శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి. అంతకుముందు ఎన్‌టిఆర్‌ గుహుడు వేషానికి డ్రైవర్‌ రాముడులో సెకెండ్‌ హీరో వేషానికి లింకుపెట్టి ఇచ్చారు. కానీ, డ్రైవర్‌ రాముడు చిత్రం హిట్‌ కూడా శ్రీధర్‌ను మరిన్ని చిత్రాలలో హీరోని చేయలేకపోయాయి. సహాయ పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇలా శ్రీధర్‌కు తాను నటించిన హిట్‌ చిత్రాలు ఎలాంటి లాభాలను చేకూర్చలేదనే చెప్పాలి. ఆయన విభిన్న పాత్రల్లో కనిపించారు. వాటిల్లో అమెరికా అమ్మాయి, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలున్నాయి. ఈయన కనిపించిన చివరి చిత్రం గోవిందా గోవిందా. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో జూలై 11, 2007 న మరణించారు. శ్రీధర్ కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)