కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునఃప్రారంభం

Telugu Lo Computer
0


సిక్కుమత స్థాపకుడు గురు నానక్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నేటి నుంచి పవిత్ర దర్శనం కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ ప్రారంభం కానుంది. సుదీర్ఘ కాలం తర్వాత సిక్కుల కోసం పాకిస్తాన్ సరిహద్దులను భారత్ తెరవబోతుంది. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ఈనెల 17వ తేదీ నుంచి బుధవారం నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ప్రకటించారు. దీనిలో భాగంగా నేటి నుంచి సిక్కులకు పవిత్ర దర్శనం కల్పించనున్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా క్షేత్రం.. భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ తుది మజిలీ ఈ ప్రాంతంలో జరిగింది. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు గడిపారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను చివరిసారిగా నవంబర్ 9, 2019న ప్రారంభించారు. అయితే కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 మార్చి 16న తాత్కాలికంగా మూసివేశారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ గురుద్వారాను కలుపుతుంది. గురు నానక్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం తలిపింది. కోవిడ్ నిబంధనల ప్రకారం యాత్రికులను అనుమతించనున్నారు. ఈ మేరకు భారత్ – పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఈ యాత్ర కోసం భారత్ నుంచి దాదాపు 100-200 మంది యాత్రికులు రోజూ కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ గుండా ప్రయాణించే అవకాశం ఉంది. పూర్తిగా రెండు టీకాలు తీసుకున్న యాత్రికులను మాత్రమే తీర్థయాత్రకు అనుమతించేందుకు భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు చూపించాలని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)