బ్లడ్‌ క్యాన్సర్‌ తో మహిళా కానిస్టేబుల్‌ మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నందమూరి గ్రామానికి చెందిన పరసా శ్రీరమ (21) అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 19 ఏళ్లకే కానిస్టేబుల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించింది. 2020 బ్యాచ్‌కు చెందిన శ్రీరమ శిక్షణ పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ మహిళా కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈ నెల 28వ తేదీన శ్రీరమ వివాహం కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగం తర్వాత పెళ్లితో తమ కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశకు పది రోజుల్లోనే తీరని నిరాశను మిగిల్చింది. గత పదిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా బ్లడ్‌ క్యాన్సర్‌ అని వైద్యులు నిర్ధారించారు. తనకు ఆ వ్యాధి ఎలా వచ్చింది, ఎలా తగ్గించుకోవాలని తెలుసుకునే లోపే ఆమె తన జీవితాన్ని కోల్పోయింది.  విధుల్లో ఉన్న శ్రీరమకు చెవుల్లో, ముక్కుల్లో నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. స్టేషన్‌ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె గురువారం అర్ధరాత్రి దాటాక తుది శ్వాస విడిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)