కోహ్లీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు

Telugu Lo Computer
0


భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ ట్విటర్‌లో బెదిరించిన యువకుడిని ముంబయి పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్‌ చేశారు. నిందితుడు 23 ఏళ్ల రామ్‌ నగేష్‌  హైదరాబాద్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కొంతకాలం ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పనిచేసినట్లు గుర్తించారు.  టీ20 ప్రపంచకప్‌లో గత నెల 24న పాకిస్థాన్‌తో భారత్‌ పరాజయం పాలైన వెంటనే ‘క్రిక్‌క్రేజీగర్ల్‌’ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా విరాట్‌కోహ్లిని బెదిరిస్తూ ఈ ట్వీట్‌ వెలువడింది. క్షణాల్లో వైరల్‌గా మారింది (అనంతరం ట్విటర్‌ ఆ ట్వీట్‌ను తొలగించింది). ఈ బెదిరింపుపై ఢిల్లీ పోలీసులతో పాటు ముంబయి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌కు చెందిన  రామ్‌నగేష్‌ ఈ ట్వీట్‌ చేశాడని ఆధారాలు సేకరించారు. బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్‌)లో అతడు ఉంటున్న క్వార్టర్‌కి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. రామ్‌నగేష్‌ తండ్రి ఓడీఎఫ్‌లో ఉద్యోగి. నిందితుడి అరెస్ట్‌ అనంతరం ఆయన తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. భారత్‌-పాక్‌ జట్ల మధ్య ఆట ముగిసిన కొద్దిసేపటికే విరాట్‌ కోహ్లి కుమార్తెపై అత్యాచార బెదిరింపుల ట్వీట్‌ రావడంతో దానిపై దేశవ్యాప్తంగా వెల్లువలా విమర్శలొచ్చాయి. బాధ్యుడిని ఉరితీయాలంటూ వేలమంది రీట్వీట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)