నిరసన హక్కుకు నీరాజనం ఈ ఉద్యమం

Telugu Lo Computer
0


అన్నదాతలు అన్ని రకాల కపట, కార్పణ్య, ద్రోహ, దారుణ అణచివేత వ్యూహాలను తట్టుకుని, దాటుకుని, ఎదురు నిలిచి గెలిచారు. ఎవరినీ సంప్రదించకుండా తెచ్చిన ఆర్డినెన్సులను, చర్చలు లేకుండా పార్లమెంటు ఆమోదించిన చట్టాలను నిలువరించి, నిలదీసి తిప్పికొట్టారు. పౌరసత్వ చట్ట సవరణలపైన సుదీర్ఘ నిరసన కరోనాతో ప్రిదిలిపోయింది. కాని కరోనా కూడా రైతుల ఆందోళనను ఆపలేకపోయింది.

ఎన్నికల ప్రయోజనం కోసమైనా కాకపోయినా, రాజకీయ చతురవ్యూహమైనా కాకపోయినా, మూడు రైతు వ్యతిరేక శాసనాలను రద్దు చేయాలని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించడం ఒక దశాబ్దంగా సాగుతున్న ఈ దేశ వర్తమాన రాజకీయంలో కీలకమైన నిర్ణయం. రాజ్యాంగం నిర్మించిన ప్రజాస్వామ్యానికి అద్భుతమైన విజయం.
భారత ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఆర్టికిల్ 19(ఎ) మాట్లాడే స్వాతంత్ర్యాన్ని గుర్తించి రక్షిస్తానని గ్యారంటీ ఇస్తుంది. ఈ హక్కు వాడుకుంటే వచ్చే శక్తి ఊహాతీతమైంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులలో రైతులు సాగించిన నిరంతర ధర్నా ఉద్యమం వారి అభివ్యక్తి స్వాతంత్ర్య సద్వినియోగానికి తాజా ఉదాహరణ.
రాజ్యాంగంలో మీరు ఎవరికైనా ఓటు వేసే స్వాతంత్ర్యం ఉందని, ఎవరినైనా విమర్శించ వచ్చునని నేరుగా వాక్యాలు కనిపించవు. కాని ఈ రెండూ ప్రాథమిక హక్కులని అందరికీ అర్థమవుతుంది. రాజ్యాంగం చదవకపోయినా తెలుస్తుంది.
సుప్రీంకోర్టులో రైతు వ్యతిరేక చట్టాలను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన రిట్ పిటిషన్ వేసినా, రహదారుల వెంట సుదీర్ఘ ధర్నా చేసినా, ఉద్యమ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చినా, ఆర్టికల్ 19(1)ని వినియోగించడమే.
రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులను ఓడించడానికి రైతులు, వారి అభిమానులు, రైతు వ్యతిరేక చట్టాల విమర్శకులు ఓటు వేయాలని నిర్ణయించుకుంటే అదికూడా అభివ్యక్తి స్వాతంత్ర్య వినియోగమే. లేదా ఆ విధంగా ఓడిస్తారేమోననే భయంతో చట్టాలను రద్దు చేసుకుంటే అది 19(1)(ఎ) హక్కు వినియోగ పరిణామమే.
పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం పిండగ తమ కండలను కరిగించి నెత్తురులు రంగరించి కష్టపడే కృషీవలురు నాగళ్లు వదిలి రోడ్లెక్కవలసివచ్చిందంటే, అందుకు ఈ మూడు చట్టాలే కారణం.
ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాలు తమకు వ్యతిరేకంగా వ్యవహరించినా రైతులు చలించలేదు. వారిమీద జల ఫిరంగులు చలికాలంలో నీటి పిడుగులు కురిపించినా భయపడలేదు. ఉత్తరాది చలి ఎంత ఘోరమో అక్కడి ఎండల ఉష్ణోగ్రత కూడా అంత తీవ్రమే. వానలు, చలి, ఎండలు భరించి ఏడాదికిపైగా ఉద్యమం చేసిన రైతుల గుండె బలం గెలిచింది.
సిగ్గు ఎగ్గులు వదిలేసి ఉద్యమాన్ని నిందించారు. దేశద్రోహులన్నారు. జాతివ్యతిరేకులన్నారు. ప్రతిపక్షాల కుట్రలన్నారు. విదేశీ శక్తులన్నారు. అర్బన్ నక్సలైట్లన్నారు. రైతుల ముసుగులో ఉన్న ప్రతీపశక్తులన్నారు. వారి శీలహననం చేశారు. బాగా చదువుకున్నాం అనుకునేవారు కూడా రైతులకు తలకాయలేదని వాదించారు.
కార్పొరేట్ వ్యాపారుల కొమ్ముకాసి వారి లాభాలకు కాపు కాసి, రైతులను ద్వేషించే చెత్త రాజకీయ నాయకులు బాహాటంగా రైతు వ్యతిరేక చట్టాలు రైతులకు మేలు చేస్తాయని ప్రచారం చేసారు. వాటిని లక్షల మంది చూసి మరికొన్ని వేలమందికి పంచుకున్నారు.
గోడు చెప్పుకుందామని దేశ రాజధానికి వచ్చిన రైతులలో ద్రోహులను జొప్పించి, లేని విధ్వంసం సృష్టించి, వారి మీదే దేశద్రోహం కేసులు పెట్టారు. వారిపక్షాన నిలబడిన పాత్రికేయులను బూటకపు కేసులతో బెదరగొట్టారు. ధర్నాలపై కిరాయి గూండాలతో దాడులు చేయించారు. ఇనుప రాడ్లు, కర్రలు, లాఠీలతో కొట్టించారు. పోలీసులతో కాల్పులు జరిపించారు. లాఠీచార్జీలు చేయించారు.
ఆ ఊరి ప్రజలు అనే ముసుగులో మరెవరో మందలను పంపి క్రూరమైన హింసాకాండ జరిపించారు. కోర్టులతో రిట్టించి, రెట్టించి తిట్టించారు. మీకు సుదీర్ఘంగా ఉద్యమించే హక్కు లేదని కొత్త భాష్యాలు చెప్పించారు. నిజానికి రైతులు రహదారుల వెంట ధర్నాలుచేసినా రాకపోకలను ఆపలేదు, అయినా నిర్బంధించే హక్కులేదని న్యాయస్థానాలలో పిల్ వేసిన న్యాయవాదులు ఎందరో ఉన్నారు.
రైతులు రోడ్డు మీదకు రాకుండా హైవేలు కూడా బద్దలు కొట్టి, లక్షల రూపాయల కాంక్రీట్ స్టీల్ అడ్డంకులను నిర్మించారు. శత్రువులు ప్రవేశించకుండా కోటలు అగడ్తలు నిర్మించే పాతకాలం రాజుల వలె ఈ ప్రజాపాలకులు రైతులను రాజధానికి రానీయకుండా కాంక్రీట్ కోటలు నిర్మించారు. పత్రికల్లో కాలాలకు కాలాలు పెయిడ్ న్యూస్ రాయించారు. వ్యతిరేక వ్యాసాలు గుప్పించారు.
టీవీల్లో పాలక పక్షపాత ఏంకర్లతో రైతులపై నిందావాక్యాలు కురిపించారు. ఇక అధికార పార్టీల అధికార ప్రతినిధులు – అదే స్పోక్స్ పర్సన్స్ అయితే తమ ప్రతిభను, భాషను, మెదడును, వక్రీకరణ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించి పార్టీపట్ల పతివ్రతలుగా మిగిలిపోవడానికి పడిన తంటాలు అన్నీ ఇన్నీ కాదు.
మూడు రైతు వ్యతిరేక చట్టాలను ప్రధానమంత్రిగారే రద్దు చేయడం ఆ అధికార ప్రతినిధుల నోళ్లను మూయించింది. అయినా వ్యవసాయమంత్రి తోమర్ వంటి నేతలు కొందరు రైతులకు రైతు చట్టాల గొప్పతనం అర్థం కాలేదని, తాము చెప్పలేక పోయామని వ్యాఖ్యానించారే గాని తమ అహంకారపు పర్వత శిఖరాలనుంచి ఒక్క అంగుళం కూడా దిగలేకపోయారు.
ఆందోళన జీవులని కొత్త పదాలను కల్పించి మరీ ఉద్యమ రైతులను నిందించారు. పనీ పాట లేక డబ్బెక్కువై ఆందోళన చేస్తున్నారన్నారు. రైతు నాయకులు బిర్యానీ తింటూ బర్డ్ ఫ్లూ వ్యాధిని వ్యాపింప చేస్తున్నారన్నారు. రైతులకు వ్యతిరేకంగా అసలు ఎవరూ ఊహించని నిందలు, ఆరోపణలు, పుకార్లు, తప్పుడు సమాచారాలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, మార్ఫింగ్ చేసిన ఫోటోలు... అంతులేకుండా సాగాయి.
అన్నిటికన్నా దారుణం లఖీంపుర్ ఖేరీ సంఘటన. ర్యాలీ నిర్వహిస్తున్న రైతుల బృందాన్ని వెనుకనుంచి పెద్ద వాహనం ద్వారా ఢీకొట్టి నలుగురు రైతులను చక్రాలకింద నలిపేయడం, వారితోపాటు మరో నలుగురిని చంపడం. రైతుల ఆందోళన అణచివేత వ్యూహాల్లో అత్యంత క్రూరమైన అమానవీయమైన రాక్షస హత్యాకాండ అది. దానికి కేంద్రమంత్రిగారి తనయుడు సారథ్యం వహించడం, ఈ నేరాన్ని దర్యాప్తు చేయడానికి కూడా యూపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం మరింత దారుణం.
సుప్రీంకోర్టు గట్టిగా కోప్పడితే తప్ప అరెస్టు చేయడానికి కూడా పాలకులకు మనసొప్పలేదు. లఖీంపూర్ ఖేరీ దారుణం నుంచి ప్రజల చూపు మరల్చాలంటే రైతు చట్టాల రద్దు ఒక్కటే మార్గం అని అనుకున్నారేమో తెలియదు. ఈ పని ఆ జనం దృష్టిని మళ్లిస్తుందో లేదో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు.
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నాటికి ఒక లెక్కప్రకారం ఈ ఆందోళన మొదలై సంవత్సరం అవుతుంది. నిజానికి అంతకుముందే ఆందోళనకు శ్రీకారం చుట్టారు. 2021 రాజ్యాంగ దినోత్సవం నుంచి ఆందోళన తీవ్రతరం చేద్దామని రైతునాయకులు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు లేకపోతే అసలు రైతులు గానీ, రైతు చట్టాలు గానీ, వాటికి వ్యతిరేకంగా సాగుతున్న సుదీర్ఘ ఆందోళన కానీ ఎవరికైనా గుర్తుకు వచ్చేదో కాదో.
ఆందోళనకారులు ధర్నా స్థలాల నుంచి ఇళ్ళకు వెళ్లాలని ప్రధాని వినతి చేశారు. ఆ విధంగా జరిగితే బాగుండేదే. కాని పార్లమెంటులో ఆ మూడు చట్టాలు రద్దు చేసేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. ప్రధాని విశ్వసనీయతకే ఇది ఒక సవాలు. ఈ పరిస్థితి రాకుండా ఉండాల్సింది.
ఆర్డినెన్సులు తేవడం, బిల్లులు ఆమోదించడం, రాష్ట్రపతి సంతకం చేయడం, ప్రభుత్వం సకల శక్తులు ఒడ్డి పోరాడడం, నాలుగో స్తంభం కూడా రైతులకు అండగా లేకపోవడం, సుప్రీంకోర్టులో వివాదాంశం కావడం వంటి అన్ని ‘రాజ్యాంగ పరమైన’ చర్యలను ప్రజాసభ నీరుగార్చింది. అటువంటి క్లిష్టదశలో ప్రజలే నిర్ణేతలు కావడం, సార్వభౌములు, స్వాములు కావడమే ప్రజాస్వామ్యం.
ముందు ప్రభుత్వం ఆర్డినెన్సుల ద్వారా మూడు శాసనాలను అమలులోకి తెచ్చింది. తరువాత వాటిని చట్టాలు చేసేందుకు బిల్లులను ప్రవేశ పెట్టింది. నిజానికి చట్టాలు చేసే అవకాశం వచ్చేదాకా కొద్ది నెలలు వేచి ఉండవచ్చు. అంత తొందర ఏమిటో ఆర్డినెన్సుల ద్వారా సత్వరం రైతులకు లాభాలు ప్రయోజనం చేకూర్చాలన్నంత గొప్ప ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు.
సరే ఇప్పుడు ఈ చట్టాలు రద్దు చేయడానికి పార్లమెంటు సమావేశాలు ఆరంభమయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వెంటనే రద్దు చేయాల్సిన అర్జన్సీ ఎందుకు కనపడలేదో వారికే తెలియాలి. ఆర్డినెన్సు ద్వారా వచ్చిన ఈ చట్టాలను ఆర్డినెన్సు ద్వారా రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రజానుకూల ప్రతిష్ట మరింత పెరిగేది.
700 మందికి పైగా రైతులు ఈ ఆందోళనలో చనిపోవడం ఒక గొప్పవిషాదం. అమలుకాకుండా రద్దు కాదగిన మూడు రైతు వ్యతిరేక చట్టాల గురించి వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి తగిన వాతావరణం కల్పించి ఉండాల్సింది కాదు. చట్టాలురద్దు చేస్తానని చెప్పి, క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి, అమరులైన ఆ రైతులకు కూడా నివాళులు అర్పిస్తే ఇంకా బాగుండేది. ఆ రైతుల కుటుంబాలను ఆదుకొంటే ప్రభువులకు కరుణ కూడా ఉందని తెలిసేది.

✍️ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
మాజీ కేంద్ర సమాచార కమిషనర్

Post a Comment

0Comments

Post a Comment (0)