విద్యుత్తు బకాయిలపై ఈఆర్‌సీ ఆగ్రహం !

Telugu Lo Computer
0


తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు (ఈపీడీసీఎల్‌) బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 150 కోట్లకు పైగా విద్యుత్తు బిల్లులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సి ఉంది. ప్రతినెలా ఇవి అంతకంతకు పెరుగుతుండటంపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిర్ణీత గడువులోగా ఆ బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వ, స్థానిక సంస్థలకు విద్యుత్తు సరఫరా నిలిపేయాలని డిస్కంలను ఆదేశించింది. దీంతో ఈపీడీసీఎల్‌ అధికారులు ఎలాగైనా వసూలు చేయాలని భావిస్తున్నారు. మరో వైపు కార్యాలయాల నిర్వహణకే సొమ్ములు లేకుంటే కరెంటు బిల్లులు ఎలా చెల్లించగలమని పలువురు అధికారులు అంటున్నారు. అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు 16,71,979 వరకు ఉన్నాయి. వీటి నుంచి ప్రతినెలా సుమారు రూ. 410 కోట్లు బిల్లుల రూపంలో వసూలు కావాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుతు వినియోగదారులు ప్రతినెలా బిల్లులు చెల్లించేస్తుంటారు. ఒకవేళ చెల్లించకుంటే విద్యుత్తు సరఫరా నిలిపేస్తుంటారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల విషయంలో మాత్రం దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వ సంస్థలే కదా ఎప్పుడో ఒకనాడు చెల్లిస్తాయని భావిస్తున్నారు. దీంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. వీటిని వసూలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా కరెంటు సరఫరా నిలిపేయాలని విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)