పీఆర్‌సీ మీటింగ్ బాయ్‌కాట్...!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీఉద్యోగులను విస్మరించింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్ అప్పుడు ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అలాగే పీఆర్‌సీ అమలుపై కూడా హామీలుఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టారు. పీఆర్‌సీ అమలు సంగతి తర్వాత ముందు పీఆర్‌సీ నివేదిక ఇవ్వండి చాలు అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చివరికి నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పీఆర్‌సీ వివాదం ప్రస్తుతం రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. అక్టోబర్ నెల చివరికి పీఆర్‌సీ సమస్యను పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం కనీసం నివేదిక కూడా సిద్ధం చేయలేదు. ఇదే ఇప్పుడు ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. గత నెలలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అప్పుడు హామీ కూడా ఇచ్చారు. కానీ అది అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా ఈ రోజు ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి మొత్తం 13 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ సమావేశాన్ని తొమ్మిది ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు. పీఆర్‌సీ నివేదిక బయటపెట్టకుండా సమావేశం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం తీరు అత్యంత దారుణంగా ఉందని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)