పాత వాహనాలను తుక్కుకిస్తే....!

Telugu Lo Computer
0


జాతీయ ఆటోమొబైల్‌ స్క్రాపేజీ పాలసీని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చడానికి ఇచ్చేసి, కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి పన్నుపరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ప్రభుత్వం ఆమోదం పొందిన మారుతీ సుజుకీ టొయొట్సు ఇండియాకి చెంది తొలి స్క్రాపింగ్, రీసైక్లింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా స్క్రాపేజీ పాలసీ ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. పన్నుల పరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వచ్చు అన్నదానిపై ఆర్థిక శాఖతో చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే తుక్కు విధానం కింద ఇంకా ఏయే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి వీలుంటుందో పరిశీలించాలని జీఎస్‌టీ మండలిని కూడా కోరారు. స్క్రాపేజీ విధానంతో కేంద్రం, రాష్ట్రాలకు జీఎస్‌టీ ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి వివరించారు. రెండింటికి చెరో రూ.40,000 కోట్ల వరకూ ఆదాయం లభించగలదని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తయారీకి, ఉద్యోగాల కల్పనకు ఊతం లభించగలదని ఆయన చెప్పారు. 'కొత్త కార్లతో పోలిస్తే పాత కార్లతో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని దశలవారీగా తప్పించాలి. స్క్రాపేజీ విధానం కారణంగా అమ్మకాలు 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది' అని గడ్కరీ తెలిపారు. స్క్రాపింగ్‌ వల్ల ముడి వస్తువులు తక్కువ ధరకే లభించగలవని, దీనితో తయారీ వ్యయాలూ తగ్గుతాయని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 3-4 వాహనాల రీసైక్లింగ్, స్క్రాపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం భావిస్తోందని గడ్కరీ చెప్పారు. రెండేళ్లలో మరో 200-300 స్క్రాపింగ్‌ కేంద్రాలు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగం వార్షిక టర్నోవరు రూ. 7.5 లక్షల కోట్లుగా ఉండగా, దీన్ని వచ్చే అయిదేళ్లలో రూ. 15 లక్షల కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యంగా మంత్రి చెప్పారు. మరోవైపు, మిగతా దేశాల తరహాలోనే భారత్‌లో కూడా 15 ఏళ్ల వరకూ ఆగకుండా.. వాహనాల ఫిట్‌నెస్‌ను 3-4 ఏళ్లకోసారి పరిశీలించే విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. టొయోటా సుషో సంస్థ భాగస్వామ్యంతో మారుతి సుజుకి నోయిడాలో ఏర్పాటు చేసిన స్క్రాపింగ్‌ కేంద్రం దాదాపు 10,993 చ.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏటా 24,000 పైచిలుకు కాలపరిమితి తీరిపోయిన వాహనాలను (ఈఎల్‌వీ) తుక్కు కింద మార్చి, రీసైకిల్‌ చేయగలదు. దీనిపై సుమారు రూ. 44 కోట్లు పెట్టుబడి  పెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)