అక్షరాల్లో అసమానతలు

Telugu Lo Computer
0



దేశంలోని పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడాన్ని ఉద్యమంలా కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సంక్షేమ ఆర్థికవేత్త జాన్‌ డ్రెజ్‌ అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో పలు లోపాలు, అవలక్షణాలతో నాశనమైన పాఠశాల విద్యావ్యవస్థ ను బాగుచేయడం సాధ్యంకాదని పేర్కొన్నారు. ప్రాథమికస్థాయి నుంచి విద్యారంగంలోని అంతరాలు ఆర్థిక, సాంఘిక అసమానతలను పెంచుతున్నాయని విశ్లేషించారు. దేశ సమగ్రాభివృద్ధిలో విద్య కీలకాంశమని, ఎన్నో దేశాల అనుభవం ఇదే చెబుతోందన్నారు. డ్రెజ్‌ గతంలో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో బోధించి, ప్రస్తుతం రాంచీ విశ్వవిద్యాలయానికి విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌తో కలిసి ఆయన 'హంగర్‌ అండ్‌ పబ్లిక్‌ యాక్షన్‌', 'ఇండియా..ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఆపర్చునిటీ' తదితర పుస్తకాలు కూడా రాశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రాథమిక విద్యలో దేశం సాధించింది ఏమిటి? భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి? విద్యారంగంపై కరోనా ప్రభావం? తదితర అంశాలపై ఆయన 'ఈనాడు', ఈటీవీ భారత్‌'లతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో మూడో వంతుకు పైగా (దాదాపు 30 కోట్ల మంది) భారత్‌లోనే ఉన్నారు. ఈ వైఫల్యానికి మూలం ఎక్కడుంది? పేద, దళిత, గిరిజన వర్గాల పిల్లల చదువు పట్ల సమాజంలోని ఆధిపత్య, పాలక వర్గాల్లో ఉన్న అలక్ష్యంలోనే దీని మూలం ఉందనిపిస్తోంది. ఉదాహరణకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ 20 శాతం పెరిగినా, పాఠశాల విద్యకు కేటాయింపులు పది శాతం తగ్గాయి. ఇది అసాధారణమైన కోత. దీనిపై దేశంలో చర్చ జరగకపోవడం మరింత అసాధారణం. ప్రస్తుతం విద్యారంగం తీవ్ర విపత్తును ఎదుర్కొంటోంది. కరోనా వల్ల పాఠశాలలు గత ఏడాది నుంచి నిన్నమొన్నటి వరకూ మూతపడ్డాయి. ఇన్నాళ్లూ బడికి వెళ్లని పిల్లలు ప్రస్తుతం నేరుగా పై తరగతుల్లో చేరుతున్నారు. వారి చదువు సక్రమంగా కొనసాగాలంటే ఏం చేయాలనే అంశంపై ఎంతో ఆలోచన, కసరత్తు, చర్చ అవసరం. అదనపు నిధులూ కావాలి. ఇవేమీ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఇలాంటి పరిణామాలు దీర్ఘకాలంలో నిరక్షరాస్యతను మరింత పెంచుతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక దశలో ప్రైవేటు రంగంలో చదివే పిల్లలు సుమారు 10 శాతానికి లోపే ఉంటారనేది యునెస్కో అంచనా.భారత్‌లో ఇది చాలా ఎక్కువ. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ప్రాథమిక విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందనే అంశంలో భారతీయులకు అవగాహన లేదనిపిస్తోంది. చాలా దేశాల్లో అత్యధిక శాతం పిల్లలు ప్రభుత్వ లేదా అది సహాయం అందించే పాఠశాలల్లో చదువుతున్నారు. భారత్‌ వంటి కొద్ది దేశాల్లోనే లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో పెద్దసంఖ్యలో పిల్లలున్నారు. ఇక్కడ వీరి శాతం ఇప్పటికే 30 దాటింది. ప్రైవేటు రంగంలో అందించే విద్యలోనూ తీవ్ర అంతరాలు ఉన్నాయి. కొన్ని ప్రపంచ ప్రమాణాలతో పోటీపడి చదువు చెబుతుండగా, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలతో పోల్చినా నాసిరకంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో నవోదయ వంటి మంచి విద్యాసంస్థలుండగా, వెనుకబడిన ప్రాంతాల్లో బడులు నామమాత్రంగా నడుస్తున్నాయి. పాఠశాల విద్యలో కొనసాగుతున్న ఇలాంటి లోపాలు సమాజంలోని ఆర్థిక, సాంఘిక అసమానతలను తగ్గించాల్సిందిపోయి, కొనసాగేందుకు దోహదపడుతున్నాయి. పేద, సామాన్య వర్గాలకు చెందిన పిల్లలపై ఇటీవల దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు కదా. అందులో ప్రధానంగా ఎలాంటి అంశాలను గుర్తించారు? కరోనా సమయంలో ఆన్‌లైన్‌ విద్య వల్ల చదువులకు నష్టం జరగలేదన్న అభిప్రాయాన్ని కేంద్రం కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఉన్నత వర్గాల పిల్లల విషయం లోనే ఇది వాస్తవం. పేద వర్గాలకు సంబంధించి ఆన్‌లైన్‌ విద్య అనేది కేవలం మిథ్యేనని సర్వేలో తేలింది. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించే స్థాయికి విద్యా వ్యవస్థను బాగుచేయాలంటే ఉద్యమ స్ఫూర్తితో జాతీయ స్థాయి కార్యాచరణ అవసరం. ఉదాహరణకు అత్యున్నతస్థాయి రాజకీయ నాయకత్వం ప్రాధాన్యమిచ్చే అంశాల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయి. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం, ప్రజా పంపిణీ వ్యవస్థతోపాటు వ్యాక్సినేషన్‌ విషయంలో ఇది నిరూపితమైంది. అంతే నిబద్ధతతో విద్యారంగంలోనూ కృషి నిలకడగా కొనసాగాలి. ముఖ్యంగా పాఠశాల విద్యపట్ల ఉన్న ఉదాసీనతను పాలకులు వదిలేస్తే..ఈ వ్యవస్థలోని అనేక లోపాలను, అవలక్షణాలను అధిగమించొచ్చు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బోధనాంశాలు, బోధన పద్ధతుల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అనేక రాష్ట్రాలు ఇప్పుడు పాఠశాలలను ప్రారంభించి పాత పద్ధతుల్లోనే కొనసాగిస్తున్నాయి. సంక్షోభానికి ఇదే కారణమవుతోంది. ప్రస్తుతం పై తరగతుల్లో చేరిన పిల్లల్లో పేదలకు, మిగిలిన వారికీ తీవ్ర అంతరం ఉంటోంది. దాన్ని తగ్గించేలా బోధనాంశాలను సులభతరం చేయాలి. పిల్లలకు అదనపు సమయం ఇవ్వాలి. బ్రిడ్జి కోర్సుల ద్వారా వారికి అదనపు బోధన జరిగేలా చూడాలి. కొద్దిరోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఓ ఉపాధ్యాయుడితో మాట్లాడాను. 'చదువులో వెనకబడిన పిల్లలకోసం నేనేం చేయలేను. వీరి కోసం మిగతా పిల్లలందరికీ నెమ్మదిగా చెప్పలేను కదా' అన్నారు. ఇలాంటి ధోరణులను మనం వెంటనే విడనాడాలి. వెనకబడిన పిల్లలే ప్రాథమ్యంగా ఉండాలి. అప్పుడే సమస్యను పరిష్కరించగలం. భారత ఆర్థిక వ్యవస్థను 2025 నాటికి అయిదు ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల స్థాయికి పెంచాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. సరైన విద్య అందించకుండా ఇలాంటి లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుందా? విద్యతో..ఆర్థికవృద్ధి ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. కేవలం ఆర్థికవృద్ధిపై దృష్టి సారించడమనేది అవివేకం. బదులుగా అభివృద్ధిపై దృష్టిపెట్టడం మంచిది. ఏ దేశ అభివృద్ధికైనా విద్య కీలకం. సాంఘిక సమానతకు, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు అది అత్యవసరం. గత 20 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే.. విద్యతో వాటి పురోగమనానికి ఉన్న సంబంధం అర్థమవుతుంది. రెండూ జోడుగుర్రాల్లా పరుగెత్తకుంటే ఆర్థిక లక్ష్యాలు నెరవేరడం అసాధ్యం. విద్య విషయంలో సరైన దిశలో ప్రయాణిస్తున్న దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి? ఎక్కడో ఎందుకు! పొరుగున ఉన్న శ్రీలంక ప్రాథమిక విద్య విషయంలో భారత్‌ కంటే ముందంజలో ఉంది. అక్కడ అత్యధిక శాతం పిల్లలు ప్రభుత్వ లేదా దాని సహాయం పొందే పాఠశాలల్లోనే చదువుతున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే కేరళ, అటు తర్వాత తమిళనాడు రాష్ట్రాలు ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లో కేవలం 8% పిల్లలే క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌లో చదువుకున్నారు. మిగిలిన వారికోసం ప్రభుత్వాలు చేసిన ఏర్పాట్లు అతి స్వల్పం. ఓ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు చాలా సులభమైన పరీక్ష పెట్టాం. చిన్న వాక్యాన్ని చదవమని అడిగాం. మూడో తరగతి పిల్లల్లో కేవలం నాలుగో వంతు మందే చదివారు. కరోనాకు ముందు నేర్చుకున్న అంశాలనూ వాళ్లు మర్చిపోయారు. ప్రస్తుతం వాళ్లే నేరుగా పై తరగతుల్లో చేరుతున్నారు. వాళ్ల విద్య సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే పలువురు మధ్యలోనే చదువు నిలిపివేసే ప్రమాదం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)