దక్షిణాంధ్రలో వర్ష బీభత్సం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లోని ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో  ముఖ్యమంత్రి జగన్‌  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలో పాపవినాశనం, శ్రీవారి పాదల దారిని తితిదే మూసివేసింది. పలు చోట్ల వృక్షాలు నేలకూలి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరం జలమయమైంది. ప్రధాన రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకమేర్పడుతోంది. బుజబుజ నెల్లూరు, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. గాలుల వేగం పెరగడంతో చలితీవ్రత ఎక్కువైంది. గంట గంటకూ గాలుల తీవ్రత పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  ఉదయం నుంచి కడపలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో కడప జిల్లా పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గవంకకు ఇరువైపులా ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో వాగులు, వంకలు ఉన్నచోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు ప్రవహించే చోట ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అత్యుత్సాహం చూపి వాగులు, వంకల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో కురిసిన వర్షం అమరావతి మహాపాదయాత్ర నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసింది. నాగులుప్పలపాడులో బసచేసిన రైతుల శిబిరంలో టెంట్లు వర్షానికి తడిసిపోయాయి. భారీ వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు గంగాధర నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలోని లక్ష్మీపురం కూడలిలో వర్షపునీరు భారీగా చేరింది. ఫలితంగా అన్నమయ్య కూడలి, ఎమ్మార్‌పల్లి ప్రాంతాలకు చేరుకోవాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి, మామిడిమానుగడ్డ, కొటాల, పులిత్తివారిపల్లెలో రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో ఏర్పేడు మండలంలోని సదాశివపురం-ఏర్పేడు ప్రధాన రహదారిపై మోదుగుల పాలెం సమీపంలో స్వర్ణముఖి నది కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తోంది.  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)