వాల్మీకి కోపం

Telugu Lo Computer
0

 

వాల్మీకి  ఒకనాడు  తన శిష్యుడైన భరద్వాజునితో తమసా నదికి వెళ్లాడు. బురద లేకున్నట్టి చక్కని రేవుకు చేరి. భరద్వాజుడు నారబట్ట అందించగా భుజమున వేసుకొనెను. వాల్మీకి విశాలముగను, సుందరముగను ఉన్న ఆ వనమునంతను చూచుచు సంచరించెను. అతనికి ఒక చెట్టుకొమ్మమీద ఉల్లాసముగా ఉన్న క్రౌంచ మిధునము కనిపించినది. అంతలో ఒక బాణము రివ్వున వచ్చి వాటిలో మగ పక్షికి తగిలెను. అది గిరగిర తిరుగుచు కిందపడి రక్తమున పొర్లాడెను. దానిని చూచి ఆడపిట్ట దీనముగా విలపించినది. అది చూచి సహజముగ వెన్నవంటిదైన వాల్మీకి హృదయము ద్రవించినది. చూడగా అతనికి ఒక బోయవాడు కనిపించెను. వెంటనే శపించెను.

 “మానిషాద ప్రతీష్ఠాంత్వ మగమశ్శాశ్వతీస్సమాః!

యక్రౌంచ మిధునా దేకమవధీః కామమోహితం!!"

"ఓరీ కిరాతుడా!  కామ మోహితమైన క్రౌంచ మిధునము నుండి ఒకదానిని కొట్టినావు. నీకు శాశ్వతముగా కీర్తి కలుగకుండు గాక!”  అని శపించెను. కాని అతనికి ఆశ్చర్యము కలిగినది. అతని నోట వెలువడిన పదములు సమమైన అక్షరములు కలిగి పాదబద్ధమై లయ సమన్వితములైనవి. శ్లోకార్త మైన వాల్మీకి నోటినుండి వెలువడినందున అది శ్లోకము అనబడ సాగినది. తన నోటినుండి లయబద్ధమగు పద్యము వచ్చుటవల్ల దానినే మననము చేయుచు వాల్మీకి ఆశ్రమము చేరెను. అతని ధ్యానమంతయు లయబద్దము అయిన ఆ పద్యము మీదనే ఉండినది.  ఈలోపల చతుర్ముఖుడైన బ్రహ్మ అక్కడికి వచ్చెను. వాల్మీకి బ్రహ్మను చూచి విస్మితుడైనాడు. పాదాభివందనము చేసి అర్ఘ పాద్యాదులిచ్చి పూజించెను, అయినను అతని మనోఫలకము మీద క్రౌంచ పక్షులే ఉండెను. పెదవుల మీద ఆ పదమే ఆడుచుండెను. బ్రహ్మ వాల్మీకి మనమును గ్రహించెను. చిరునవ్వు నవ్వుచు “మహర్షీ! మీరు రచించినది శ్లోకము. అందు సందేహములేదు. నా సంకల్పము వలననే శ్లోకము మీ ముఖతః వెడలినది. కాన ఆ శ్లోకమును చరితార్ధము చేయుడు. సకల గుణాభిరాముడైన శ్రీరాముని చరితమును రచింపుడు. మీకు ఆ చరిత్రలోని రహస్యములు స్వప్రకాశములుగా అన్నియు తెలియును". అంతియ కాదు. "నతే వాగనృతా కావ్యే కాచి దత్ప్రభవిష్యతి!"  ఆ కావ్యమున మీరు రచించినదేదియు అసత్యము కాదు! ఇంకను,

యావత్ స్థాస్యంతి గిరియ స్సరితశ్చ మహీతలే! 

తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి!!

భూమిమీద పర్వతములు, నదులు ఎంతకాలము ఉండునో శ్రీ రామచరిత్ర అంతకాలము నిలిచి ఉండును. “రామకథ ఎంతకాలము ప్రచలితమగుచుండునో అంతకాలము మీరు ఊర్ధ్వ లోకముల సంచరించగలరు" అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమైనాడు. తదుపరి వాల్మీకి మిక్కిలి ఆసక్తితో రామకథను సంపూర్ణముగ తెలుసుకొను టకు ధ్యానించెను. అతనికి రామునికథ సొంతము కరతలామలకము అయి పోయినది. అప్పుడు "అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః" (అభి రాముడైన రాముని చరిత్ర రచించ సంకల్పించెను).  ఆ విధముగా సంకల్పించి కామార్థములతో కూడియుండునట్లు, గూడార్థములతో విస్తరించునట్లు, సముద్రమువలె రత్నములతో నిండి యుండునట్లు, వినువారికి యింపుగా నుండునట్లు నారదుడు చెప్పిన కథను వివరముగ వ్రాసెను.


Post a Comment

0Comments

Post a Comment (0)