అన్న అదానీ.. తమ్ముడు అంబానీ

Telugu Lo Computer
0


👉అంతా పండోరా పేపర్స్‌ తానులో ముక్కలే

👉ముకేశ్‌ అంబానీ తమ్ముడు అనిల్‌కు 18 విదేశీ కంపెనీలు

👉గౌతమ్‌ అదానీ అన్నకు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో కంపెనీ

👉సచిన్‌, అతడి భార్య, మామలకు విదేశీ కంపెనీలో షేర్లు.పనామా లీకేజీ తర్వాత చాపచుట్టేసిన సదరు కంపెనీ

👉గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కెప్టెన్‌ సతీశ్‌ శర్మ పేరిట న్యూజిలాండ్‌లో 2 ట్రస్టులు.. భారీ లావాదేవీలు

👉బాలీవుడ్‌ దిగ్గజం జాకీష్రాఫ్‌ పేరూ పండోరా పత్రాల్లో!

అంబానీల్లో తమ్ముడు (అనిల్‌ అంబానీ).. అదానీల్లో అన్న (గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ).. క్రీడాకారుడు సచిన్‌.. కళాకారుడు జాకీష్రాఫ్‌.. లాబీయిస్టు నీరారాడియా.. రాజకీయ నాయకుడు సతీశ్‌ శర్మ.. మాఫియా డాన్‌ ఇక్బాల్‌ మిర్చి కుటుంబసభ్యులు.. బయోకాన్‌ అధినేత కిరణ్‌మజుందార్‌ షా భర్త.. 

ఇలా ఆ రంగం ఈ రంగం అని లేదు..  పన్ను ఎగవేత దేశాల్లో కంపెనీలు పెట్టినవారి జాబితా అంటూ విడుదలైన పండోరా పత్రాల్లో అన్ని రంగాలకు చెందినవారూ ఉన్నారు. ఆదివారంనాడు వీరి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. సోమవారం వీరి విదేశీ కంపెనీల వివరాలూ వెలుగులోకి వచ్చాయి. అయితే, వారు మాత్రం తాము చట్టబద్ధంగానే అన్నీ చేస్తున్నట్టు చెబుతున్నారు. అది.. 2020 ఫిబ్రవరి. మూడు చైనా బ్యాంకులతో వివాదం నేపథ్యంలో తన నికర విలువ సున్నా.. అని అనిల్‌ అంబానీ లండన్‌ కోర్టులో చెప్పిన విషయం గుర్తుందా? అప్పట్లో దివాలా తీసినట్టు ప్రకటించిన అనిల్‌ అంబానీ తనకున్న 130 కోట్ల డాలర్ల విలువైన(దాదాపు రూ.10 వేల కోట్లు) ఆఫ్‌షోర్‌ కంపెనీల గురించి ఇప్పటికీ ఎక్కడా చెప్పలేదు! కానీ, నిజం నిప్పులాంటిది. ఆ నిప్పు తాలూకూ పొగ పండోరా పేపర్స్‌ ద్వారా లీకైంది. నిజానికి 2020లోనే లండన్‌ కోర్టు ఇలాంటి ఆఫ్‌షోర్‌ కంపెనీల గురించి ప్రస్తావించింది. అలాంటివేవీ తనకు లేవని అనిల్‌ అమాయకంగా కోర్టుకు చెప్పారు. ఈ క్రమంలోనే 2020 మేలో అనిల్‌ అంబానీ ఆ మూడు చైనా బ్యాంకులకూ 716 మిలియన్‌ డాలర్ల సొమ్ము చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. ఇప్పుడు పండోరా పేపర్స్‌ ద్వారా లీకైన సమాచారం మేరకు అనిల్‌ అంబానీకి అలాంటి 18 కంపెనీలు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో, జెర్సీ, సైప్ర్‌సలలో ఉన్నట్టు తెలుస్తోంది. 18 కంపెనీల్లో 8 జెర్సీలో ఉండగా 7 కంపెనీలు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో, మరో 3 సైప్ర్‌సలో ఉన్నాయి. వీటన్నింటి లావాదేవీల విలువ దాదాపు రూ.9945 కోట్లు. పలు కంపెనీల వివరాల గురించి పండోరా పత్రాల్లో ఉంది. పలు బ్యాంకుల నుంచి అప్పుల రూపంలో భారీ మొత్తాలు తీసుకున్నాయి. వీటిపై అనిల్‌ అంబానీని ప్రశ్నించగా చట్టప్రకారం భారత అధికారులకు కావాల్సిన సమాచారమంతా ఇచ్చామని అనిల్‌ అంబానీ న్యాయవాదులు తెలిపారు.

అన్న అదానీ..

పండోరా పత్రాల ప్రకారం గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ శాంతిలాల్‌ షా అదానీ 2018లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో హైబిస్కస్‌ ఆర్‌ఈ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని స్థాపించారు. సైప్రస్‌ జాతీయుడైన వినోద్‌ ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు. హైబిస్కస్‌ ఆర్‌ఈ సంస్థ సోల్‌ షేర్‌హోల్డర్‌ ఆయ నే. ఆ కంపెనీకి సంబంధించిన 50 వేల షేర్లూ ఆయన పేరిటే ఉన్నాయి. ఆ కంపెనీ ప్రస్తుత ఆస్తుల విలువ 10-15 మిలియన్‌ డాలర్ల దాకా (రూ.111 కోట్లు) ఉంటుందని అంచనా. వినోద్‌ ఆదానీ పేరు గతంలో పనామా పత్రాల్లోనూ కనిపించింది.  

సచిన్‌ కంపెనీ బంద్‌..

క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌కు కూడా బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో సాస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఉండేది. 2016లో పనామా పేపర్స్‌ లీకేజీ అనంతరం ఆ కంపెనీ చాప చుట్టేసినట్టు పండోరా పేపర్స్‌ ద్వారా వెల్లడైంది. ఆ పేపర్స్‌ ప్రకారం సచిన్‌, ఆయన భార్య అంజలి, ఆమె తండ్రి ఆనంద్‌ మెహతా.. సాస్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ముగ్గురూ కలిసి షేర్ల రూపంలో  రూ.60 కోట్ల దాకా ఆ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. అయితే, పనామా పత్రాలు విడుదలైన తర్వాత.. అంటే 2016 జూలైలో ఈ కంపెనీని మూసేశారు. ఈ కంపెనీ గురించి ప్రశ్నించగా.. అది సచిన్‌ పన్ను చెల్లించిన సొమ్ము నుంచి పెట్టుబడిగా పెట్టిన మొత్తం అని సచిన్‌ టెండూల్కర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి మృణ్మయ్‌ ముఖర్జీ తెలిపారు. ఈ పెట్టుబడి గురించిన వివరాలను సచిన్‌ తన పన్ను రిటర్నుల్లోనూ సమర్పించినట్టు చెప్పారు. సచిన్‌ చట్టబద్ధమైన పెట్టుబడులకు అక్రమ ఉద్దేశాలు అంటగట్టొద్దని ఐసీఐజేకి, పండోరా పేపర్స్‌ దర్యాప్తులో భాగమైన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వార్తాసంస్థను కోరారు.

ఇంకా...

యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్‌ కుంభకోణానికి సంబంధించి పైరవీ చేసిన ప్రముఖ లాబీయిస్టు నీరా రాడియా గుర్తుందా? అప్పట్లో ఆమె పలువురు రాజకీయనాయకులను, పాత్రికేయులను ప్రభావితం చేసినట్టు వార్తలొచ్చాయి. ఆమెకు విదేశాల్లో  రాక్స్‌బరీ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌, ఎల్మాషే హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ తదితర డజను కంపెనీలున్నాయని పండోరా పేపర్స్‌ ద్వారా వెల్లడైంది. నిజానికి ఆమె పేరు గతంలో విడుదలైన పనామా పత్రాలు, ప్యారడైజ్‌ పత్రాల్లోనూ ఉంది. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో ఉన్న ఒక కంపెనీ ద్వారా ఆమె ఏకంగా రూ.1.87 కోట్ల విలువ చేసే వాచీని దుబాయ్‌లో కొనుగోలు చేసినట్టు పండోరా పేపర్స్‌ ద్వారా లీకైంది. అక్రమార్కులకు సేవలను అందించే ట్రైడెంట్‌ ట్రస్ట్‌ కంపెనీ (బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌) ద్వారా ఆమె తన కార్యకలాపాలను సాగించింది. ఆమె సోదరి కరుణ మీనన్‌, రాడియా సహాయకుడు జెహంగీర్‌ పోచా కూడా ట్రైడెంట్‌ ట్రస్టుతో కలిసి విదేశాల్లో కంపెనీలు పెట్టినట్టు తెలిసింది. రాడియా కంపెనీలపై నెవాటియాను సంప్రదించగా స్పందించలేదు. రాడియా మాత్రం.. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక మరోసారి తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. అలాగే.. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీమ్‌కు అత్యంత విశ్వసనీయమైన సహాయకుడైన ఇక్బాల్‌ మిర్చీ కుటుంబసభ్యుల పేర్లు కూడా పండోరా పేపర్స్‌లో ఉన్నాయి. ఇక, పండోరా పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికరమైన వ్యక్తి ప్రముఖ బయోటెక్‌ ఆంత్రప్రెనర్‌, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా భర్త జాన్‌ మెక్‌కల్లమ్‌ మార్షల్‌ షా. ఆయన బ్రిటిష్‌ పౌరుడు. అయితే.. ఈ ఆరోపణలను కిరణ్‌ మజుందార్‌ షా ఖండించారు. అలాగే.. దేశం నుంచి పరారైన నీరవ్‌ మోదీ చెల్లెలు పూర్వి మోదీ బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ పేరు కూడా పండోరా పేపర్స్‌ లీకేజీలో వెలుగుచూసింది.

ఆయన అత్తగారు న్యూజిలాండ్‌లో స్థాపించిన ట్రస్టు ప్రధాన లబ్ధిదారుగా జాకీష్రాఫ్‌ పేరే ఉంది. ఆ ట్రస్టుకు స్విస్‌ బ్యాంకు ఖాతా కూడా ఉంది. కాంగ్రెస్‌ నేత, గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కెప్టెన్‌ సతీశ్‌ శర్మకు కూడా విదేశాల్లో పలు కంపెనీలున్నాయి. సతీశ్‌ శర్మ 1995లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌లో జాన్‌జెగర్స్‌ పేరుతో ఒక ట్రస్టు స్థాపించారు. అందులో ఆయన భార్య, పిల్లలు, మనవలు సహా పది మంది కుటుంబసభ్యులు లబ్ధిదారులు. 2015లో ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌లోనే జేజెడ్‌-2 పేరుతో మరో ట్రస్టు స్థాపించి భారీ లావాదేవీలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన మరణించారు.
సీబీడీటీ చైర్మన్‌ నేతృత్వంలో దర్యాప్తు
బృందంలో ఈడీ, ఆర్బీఐ, ఎఫ్‌ఐయూ అధికారులూ సంచలనం సృష్టించిన పండోరా పేపర్స్‌ కేసుకు సంబంధించి.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ నేతృత్వంలోని మల్టీ ఏజెన్సీ గ్రూపు దర్యాప్తు చేయనుంది. ఈ విషయాన్ని సీబీడీటీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)