తాలిబన్ ఉప ప్రధానితో భారత అధికారులు భేటీ

Telugu Lo Computer
0



అప్ఘానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ సాలమ్ హనాఫీతో భారత్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. "మాస్కో ఫార్మేట్ టాక్స్ ఆన్ అప్ఘానిస్తాన్" పేరుతో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యేందుకు రష్యాకు వెళ్లిన భారత అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్న అప్ఘానిస్తాన్ ఉప ప్రధానితో బుధవారం భేటీ అయ్యారు. అప్ఘానిస్తాన్ మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత్- తాలిబన్ల మధ్య జరిగిన తొలి అధికారిక సమావేశం ఇదే. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ శాఖ విభాగ సంయుక్త కార్యదర్శి జేపీ సింగ్ నేతృత్వం వహించారు. అప్ఘానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆగస్టు 31 న దోహాలో తాలిబాన్‌లతో భారతదేశపు అధికారికంగా సంప్రదింపులు జరుపగా బుధవారం రష్యాలో భారత్-తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం మధ్య తొలిసారి అధికారికంగా చర్చలు జరిగాయి. అప్ఘానిస్తాన్ కు మానవతా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాస్కోలో తాలిబన్లతో సమావేశంలో భాగంగా భారత్ హామీ ఇచ్చింది. విస్తృత సహకారం అందించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు భారత్ స్పష్టం చేసిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. ఇరుపక్షాల మధ్య ఉన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని.. దౌత్య, ఆర్థికపరమైన సంబంధాలను మెరుగపర్చుకునేందుకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, దీనిపై భారత్ అధికారిక ప్రకటన చేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)