ఉత్తరాలు..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 10 October 2021

ఉత్తరాలు..!

 


"నువ్వింకా బ్రతికి ఉన్నావని నేననుకోవడం లేదు, నీకు ఉత్తరం రాయాల్సిన దౌర్భాగ్యం వస్తుందని కలలో కూడా ఊహించలేదు, మా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చావు " ఇలా మొదలయ్యింది ఆ ఉత్తరం. పూర్తిగా చదివాక అది ఒక అన్నయ్య తమ్ముడికి (లేక తమ్ముడు అన్నయ్యకో) రాసిన ఉత్తరం. నేనూ మా తమ్ముడూ కూర్చొని చదువుకుంటుంటే పక్కింటబ్బాయి  కార్డ్ ముక్క తెచ్చి అందులో ఏదో రాస్తుంటే, అలా రాయకూడదని తీసుకొని మొదట లైన్ కే అవాక్కయ్యి చదివిన ఉత్తరం అది. ఇలాంటి గొప్ప గొప్ప విశేషాలు చిన్న కార్డ్లో రాసేసేవారు. అది బయటవారు చదివితే కుటుంబ పరువుపోతుందన్న ఇంగితం కూడా ఉండేది కాదు. 

మా ఊరికి ఏ కార్డ్ ముక్క వచ్చినా ఊరి మొదట్లో ఒక పెద్దాయన "నేను ఇస్తాలే వాళ్ళకి " అని తీసుకొని, చక్కగా చదివేసి తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడు. ఆయనకి అదో సంబడం!  చిన్నప్పుడు ఒక కార్డ్ ముక్కలో ఎన్నీ విశేషాలు రాసేవారో కదా? మా చిన్నప్పుడు ప్రతీ శనివారమూ మా చేత మా అమ్మానాన్నలకు కార్డ్ ముక్క రాయించేవారు మా తాతగారు. మొదట మా పిన్ని నా చెయ్యి పట్టుకొని రాయించేది, ఆ తరవాత పలక మీద రాయించేది, ఆ తరవాత తను పలక మీద రాసింది చూసి కార్డ్ మీద రాయాలి, ఆ తరవాత డిక్టేషన్ చెబుతుంటే మేము కార్డ్ మీద రాసేవాళ్ళము. ఇదంతా ఐదు ఆరేళ్లకే పెద్దవాళ్ళు నేర్పించిన విద్య. ఆ తరవాత కార్డ్ ఎప్పుడు దొరికినా బోలేదు కబుర్లతో ఉత్తరాలు రాసేవాళ్లము. 

ఒకసారి నేను రాసిన కార్డ్ మా తాతగారు తప్పులు చూడకుండా పోస్ట్ చేశారు. అందులో "ఇక్కడంతా 'క్షేమం' కి బదులు 'క్షామం ' " అని, "ఇంటికి చుట్టాలు వచ్చారనడానికి బదులు 'చుట్టలు ' అని రాశాను. తిరుగు టపాలో మా నాన్నగారి క్లాస్తో ఉత్తరం వచ్చింది. ఎప్పుడైనా ఉత్తరం రాయడం లేట్ అయితే రిప్లై కార్డ్ తో కోపంగా మా నాన్న గారు ఉత్తరం రాసేవారు.  అప్పుడప్పుడు "అమ్మమ్మ, తాతగారు మమ్మల్ని ఏడిపించేస్తున్నారని " కూడా రాసేసేవాళ్ళము. చిన్న కార్డ్ ముక్క హనుమంతుడి కన్నా ఎక్కువ రాయబారాలు తీసుకెళ్ళేది. అప్పుడప్పుడు పిచ్చి కాయితాలలో ఎన్నో విన్నపాలు రాసి దాని మీద "మా ఊరు" అని రాసి పోస్ట్ బాక్స్ లో వేసేసేదాన్ని, అది కూడా చేరిపోతుందేమో అని! నా చిన్నప్పుడు ఆ పోస్ట్ బాక్స్ పెద్ద విచిత్ర వస్తువు. "నేను రాసిన ఉత్తరాలు అందులో నుంచి ఎలా వెళ్తాయో? " అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయము. అప్పుడప్పుడు ఆ పోస్ట్ బాక్స్ లో దూకేస్తే మా ఊరు వెళ్ళిపోవచ్చు కదా, ఇలా బస్సు ఎక్కే బదులు అని అనుకునేదాన్ని. ఎన్నో సార్లు పోస్ట్ డబ్బాలో దూకాలని ప్రయత్నించేదాన్ని కూడా!  ఆ తరవాత మా అమ్మమ్మ చూపించింది "పోస్ట్ మాన్ ఆ బాక్స్ లో ఉత్తరాలను తీసి బస్సు ఎక్కిస్తారని " ఆ తరవాత అవి ఎలా ప్రయాణం చేసి ఎడ్రస్ రాసిన వాళ్ళకి చేరతాయో చెప్పింది. ఇప్పటికీ పోస్ట్ బాక్స్ చూస్తే అందులో ఏదో సొరంగం ఉన్నట్టు అనిపిస్తుంది. 

ఇంక ఉతరాలలో రకాల గురించి మాట్లాడుకుందాము. కొన్ని ఉత్తరాలు ఉంటాయి.. అవి పేరుకే ప్రేమలేఖలు.. అందులో ప్రేమా ఉండదు, లేఖలా కూడా ఉండదు. అదేదో పాత పద్దు పుస్తకంలో నుంచి ఒక పేజీ చింపేసినట్టుగా "మీరు నాకు వెయ్యి రూపాయిలిచ్చారు, అందులో వందా ముప్పై మా బాబాయ్ కొడుక్కి అప్పిచ్చాను, ఇంకో ఐదొందలు పెట్టి నేనూ, నాని గాడు బట్టలు కొనుకున్నాము, ఇంకో ఎనభై రూపాయిలు జీడిపప్పుకొన్నాను, రెండు రూపాయిలతో నానిగాడికి చిక్కి కొన్నా..." అంటూ సాగే లేఖ. ఇంకొన్ని ఉత్తరాలు వారి వారి ప్రతిభను చూపెట్టుకునేవి "ఋష్యాశ్రమ ఘట దుశ్యంత చకిత దృశ్యాంకిత  శకుంతలవో " అని రాస్తే, ఆ ఉత్తరం అందుకున్నమ్మాయి రెండు చేతులతో బుర్రగోక్కొని "ఏవన్నాడో?" అని ఆ ఉత్తరం అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళీ చూపించి అర్ధమడుకుంటుంది. "చుంబనం " అంటే దబ్బనానికి అక్కో, గునపానికి అత్తో అనుకునే రకాల వద్ద ఇలాంటి పైత్యం ప్రదర్శించే బాపతులుంటారు.  ఇంకొంతమంది మేధావులు సినీ రచయితలని ఆశ్రయిస్తారు. వారు సినిమాలకు రాసిన పాటలని వీరు ఉత్తరాలలో రాసేస్తుంటారు. " పూసిన పారిజాతమా, రాయని ప్రేమగీతమా" అనో ," అందాలరాశి... నీ అందచందాలు చూసి, ఎన్నో గ్రంధాలు రాసి... తరించేనులే ప్రేయశి " అని రాస్తూ పోతూ ఉంటారు, అటువైపు వాళ్ళకి ఈ విషయం తెలియనంతవరకు వీరు సేఫ్, అదే తెలిస్తే ఇటు వేటూరి, అటు సీతారామశాస్త్రుల ప్రేమలేఖలు తిరుగుతుంటాయి.   మరికొందరికి సినిమా హీరోయిన్లంటే పిచ్చి  "నువ్వు సైడ్ యాంగిల్ లో రాజసులోచనలా ఉంటావు, అప్పుడప్పుడు చూస్తుంటే జి. వరలక్ష్మిలా ఉంటావు, మొన్నసారి వచ్చినప్పుడు నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అచ్చు కాంచనమాలలా అనిపించావు, నీ నుంచి ఉత్తరం వచ్చినప్పుడు మనసు ఎల్.విజయలక్ష్మిలా గంతులేస్తుంది, రానప్పుడు శ్రీరంజనిలా ఏడుస్తుంటుంది " అని రాస్తారు. ఈ హీరోయిన్లు ఎప్పటివారో పాపం ఆ పిల్లకు తెలీయక, బామ్మనో అమ్మమ్మనో ఆశ్రయిస్తుంది.  

"ఈ రోజు అమ్మ అప్పుతచ్చులు, పప్పుచెక్కలు, లడ్లు, చనివిడి చేసింది, నాకు మీరు గుర్తొచ్చారు " అని రాసే శ్రీలక్ష్ములుంటారు, (ఈ చెక్కవడంత చెక్కమొహమనా? లేక లడ్డులా ఉన్నాడనా? లేక చనివిడిముద్దలా ఉన్నాడనా? దీని అర్ధం?).  

మరికొన్ని ఉత్తరాలు తలాతోకా ఉండవు" మా పక్కింటబ్బాయికి పెళ్ళయ్యింది  నాలుగు పక్షిపిల్లలు పుట్టాయి, ఎదురింట్లో వేపచెట్టు మీద కాపురం ఈ నెలలోనే పెడతారుట" అంటూ కామాలు ఉంచాల్సిన చోట ఉంచకుండా, రాస్తూ ఉంటారు.   

ఇంకొన్ని లేఖలుంటాయి... అవి రోజువారి రాసుకొని డైరీలాంటివి. నిన్న పొద్దుటే లేచాను, లేచాక వాకింగుకి  వెళ్ళొచ్చి కాఫీ తాగాను.... రాత్రి ఓడమస్ రాసుకొని పడుకుంటున్నాను.. " అంటూ ముగిస్తారు. మరికొన్ని ఉత్తరాలు చావుతో మొదలెట్టి తద్ధినాలతో ముగిస్తారు. మరికొన్ని ఉత్తరాలు ఊర్లో జనాల గురించి పితూరీలు. నా చిన్నప్పుడు నేను వేశవి శెలవలకి మా ఊరు వెళ్ళాను, మా ఊర్లో అప్పుడు టి.వి. లేదు. అదే టైంలో టి.వి.లో "రాణీ రత్నప్రభ" సినిమా వచ్చింది. మా పిన్ని ఆ  సినిమా మొత్తం కళ్ళకు కట్టినట్టు ఉత్తరంలో రాసి పంపింది.  

ఇలా ఉత్తరాలతో ఎన్నో జ్ఞాపకాలు. ఉత్తరాలన్నీ చక్కగా ఒక ఇనప వైర్ కి గుచ్చి దాచుకునేవారు. అవి అప్పుడప్పుడు తీసి చదువుతూ  సడ్డన్ గా ఏడ్చేవారు కూడా ఆ సంఘటలను మళ్ళీ తలచుకొని. కొన్నీ ఆనందకరమైన ఉత్తరాలు చదివి మళ్ళీ మళ్ళీ ఆనందపడేవారు.

No comments:

Post a Comment

Post Top Ad