జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌

Telugu Lo Computer
0

 


హైదరాబాద్‌ నగరంలో జలవిహార్‌లో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తనయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం అలయ్‌ బలయ్‌ కార్యక్రమం జరుగుతున్నది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్ల, చాడ వెంకట్‌రెడ్డి, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, బీజేపీ నేత బండి సంజయ్‌, లక్ష్మణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, ఆయన కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో భాగంగా తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో భాగంగా దుర్గామాత, జమ్మిచెట్టుకు పూజలు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్‌ బలయ్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వేరైనా మనమంతా భారతీయులమన్నారు. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైందన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ప్రతి ఒక్కరూ పండుగలో పాల్గొనాలన్నారు. రుచులు, అభిరుచులు మారుతున్నాయని, ప్రకృతితో కలిసి జీవించండి.. ప్రకృతిని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. కరోనా ముప్పు తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రగతికి దత్తాత్రేయ అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించడం శుభపరిణామమన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమం లేదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)