టీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

Telugu Lo Computer
0


దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు సోమవారం నాడు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈనెల 18వ తేదీ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రూ.14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పండగల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ప్రయాణం సాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రజలకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని అన్ని బస్టాండ్‌లలో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు సోమవారం నాడు నోటీసులు పంపారు. మరోవైపు ఉచిత మరుగుదొడ్ల వద్ద ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేసిన వారికి కూడా జరిమానాలు విధించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అధిక ధరల విషయంపై హైదరాబాద్ నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్‌లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)