జనసేన రహస్య సర్వే!

Telugu Lo Computer
0



2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి ఘోర పరాజయం మూట గట్టుకున్న జనసేన  2024 ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో పాటు కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు పవన్ మొదలెట్టారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక కోసం రహస్య సర్వే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో అంతర్గతంగా వేసిన స్క్రీనింగ్ కమిటీ ఆధారంగా పవన్ అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం సర్వే చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందు కోసం తనకు సరైన వనరులు లేకపోవడంతో ముంబయికి చెందిన ఓ సంస్థకు ఈ సర్వే బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో జనసేన తరపున ఈ సంస్థ రంగంలోకి దిగుతుంది. ఆ సంస్థ ప్రతినిధులు ఎవరనేది కూడా తెలియకుండా ఈ రహస్య సర్వే జరగనుందని సమాచారం. ఒకవేళ సర్వే చేసే వ్యక్తులు ఎవరో తెలిస్తే సీటు కోసం ఆశ పడుతున్న అభ్యర్థులు వాళ్లను ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు సర్వే చేస్తున్నారో తెలీకుండానే రహస్యంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇలాంటి కార్పొరేట్ సంస్థలపై ఆధారపడడం ఎంతవరకూ కరెక్ట్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముంబయికి చెందిన సంస్థ అంటే కచ్చితంగా సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా ఆధారపడే అవకాశముంది. మరోవైపు జనసేనలో ప్రస్తుతం ఉన్న నాయకులంతా సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్లే కానీ ప్రజల్లోకి వెళ్లేవాళ్లు చాలా తక్కువ. దీంతో ఒకవేళ ఆ సంస్థ కేవలం సామాజిక మాధ్యమాల్లోచూసి మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)