ధనత్రయోదశి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 October 2021

ధనత్రయోదశి


ధనత్రయోదశి నాడు ఇంటి ముంగిళ్ళలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంటికొస్తుంది, యముడు మీ వైపు చూడడు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఈ పర్వదినానినే ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి.

ధనత్రయోదశి రోజున ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది. అందుకే సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని ఈ ధనత్రయోదశి రోజును పవిత్రమైన రోజుగా పూజిస్తారు. అయితే లక్ష్మీపూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున నరకాసుని చెర నుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. 

ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. ఈ శుభదినాన వెండి – బంగారం కానీ, ఒకటి రెండు కొత్త పాత్రలు కానీ కొంటే అదృష్టం వస్తుందని నమ్మకం. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

ధనత్రయోదశి నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవీ పూజ శ్రేష్ఠం. ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. ధనత్రయోదశి పూజ చేయడం విశేష ఫలప్రదమని సూచన.

ధనత్రయోదశి నాడు లక్ష్మీ దేవిని భక్తితో పూజించాలి. తీపి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు. వ్యాపారస్థులు – గృహస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి. దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో బుడిబుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండాలి.  

అట్లే పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఈ దినాన సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కావున ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమ దీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి..

No comments:

Post a Comment