బాగా ఉడికించి తినాల్సిన కూరగాయలు

Telugu Lo Computer
0

 

కూరగాయలు ఉడికించడం వల్ల అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని చాలామంది భావిస్తుంటారు. అందుకే టమాటో, క్యారెట్, బ్రకోలీ, వెల్లుల్లి, ఉల్లి ఇలా చాలా కూరగాయలను కొందరు పచ్చిగానే తింటుంటారు. అయితే కొన్ని కూరగాయలు పచ్చిగా తిన్నా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కానీ కొన్ని కూరగాయలను ఉడకబెట్టకపోయినా.. లేదా సరిగా వండకపోయినా.. అవి పూర్తి హానికరంగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇవి ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి.

మొలకెత్తిన బంగాళాదుంపలు : కూరల నుంచి స్నాక్స్ వరకు బంగాళదుంపను చాలా వాటిలో విరివిగా వాడుతుంటారు. అయితే బంగాళాదుంపలను ఎప్పుడూ కూడా బాగా ఉడికించాలి. బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభిస్తే వాటిపై ఆకుపచ్చ కలర్ లో మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ ఆకుపచ్చ మచ్చల నుంచి సోలనిన్ అనే విషం ఉత్పత్తి అవుతుంది. బంగాళా దుంపలపై చిన్న ఆకుపచ్చ బుడిపెలాగా లేదా మచ్చలు కనిపిస్తే వాటిని బాగా ఉడికించండి. 

సొరకాయ : సొరకాయ జ్యూస్, సొరకాయ కూర చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. బరువు తగ్గడం, బ్లడ్ షుగర్ తగ్గించడానికి అవసరమైన విరుగుడు పదార్థాలు సొరకాయలో ఉంటాయని చెబుతుంటారు. అయితే ఇది బాగా ఉడికించి తినాలి. లేదంటే ఒక జ్యూస్ లాగా చేసుకొని తాగాలి. ఒకవేళ సొరకాయ సరిగా ఉడికించకపోతే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వంకాయ : వంకాయలను సరిగా ఉడికించకపోతే.. వాటిలో బంగాళాదుంపల్లో లాగా గ్లైకోఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉత్పన్నమవుతాయి. ఇవి విషపూరితం కానప్పటికీ సరిగా వండితే మంచి పోషక ప్రయోజనాలు అందిస్తాయి.

కస్సావా : కస్సావా అనేది ఒక రకమైన జాతి చెట్టు దుంపలు. కొందరు భారతీయులు దీన్ని ఎక్కువగా వంటకాల్లో వాడతారు. అయితే దీన్ని తప్పనిసరిగా నానబెట్టాలి లేదా వాడే ముందు చక్కగా ఉడికించాలి. పచ్చి టోపియోకా సైనైడ్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ప్రాణాంతకమైన విషం. అందుకే ఈ దుంప విషయంలో జాగ్రత్త వహించాలి. 

మొలకెత్తిన పచ్చి గింజలు : మొలకెత్తిన పెసరపప్పు, ఆల్ఫలా బీన్స్ తో  జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, మొలకెత్తిన గింజల్లోకి పాథోజెన్స్ ఈజీగా ప్రవేశించగలవు. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

బ్రకోలీ : బ్రకోలీ కూరగాయ ఉడికించినా లేదా స్టీమ్ చేసినా చక్కటి పోషక ప్రయోజనాలు అందిస్తుంది. సరిగ్గా వండటం వల్ల ఇవి వెంటనే జీర్ణం అవుతాయి. అలాగే చక్కగా ఉడికించడం వల్ల అందులోని పోషకాలు క్యాన్సర్ తో పోరాడే సమ్మేళనాలను పెంచుతాయి.

గ్రీన్ బీన్స్ : గ్రీన్ బీన్స్ మరీ ప్రమాదకరమైనవి కాదు.. అలాగే మరీ విషపూరితమైనవీ కాదు. కానీ వీటిని చక్కగా ఉడికించి తినాలి. వీటిలో ఉండే అధిక లెక్టిన్ స్థాయిలు పలు జీర్ణసంబంధ సమస్యలకు దారి తీస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)