వినోద్ ఖన్నా

Telugu Lo Computer
0


వినోద్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. గుర్దాస్ పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. 1968 నుండి 2013 మధ్య దాదాపు 141 సినిమాల్లో పనిచేశారు. 2007లో విడుదలైన పాకిస్థానీ చిత్రం గాడ్ ఫాదర్ లో ప్రధాన పాత్ర పోషించారు ఆయన. పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టారు ఖన్నా. ఆయన తండ్రి కిషన్  చంద్ ఖన్నా బట్టల వ్యాపారి, తల్లి కమలా. 1946 అక్టోబరు 6న ఇప్పటి పాకిస్థాన్ లో ఉన్న పేష్వార్ లో జన్మించారు ఆయన.  ఆయనకు ఇద్దరు సోదరేమనులు, ఒక సోదరుడు. వినోద్ పుట్టిన కొన్ని నెలలకే భారత విభజన జరగడంతో వీరి కుటుంబం పేష్వార్ ను వదిలి  ముంబై చేరింది.

రెండో తరగతి వరకు ముంబై లోని క్వీన్ మేరీ స్కూల్ లోనూ, సెయింట్ గ్జేవియర్స్ హై స్కూల్, ఫోర్ట్ లో 1957వరకు చదువుకున్నారు. ఆ తరువాత వారి కుటుంబం ఢిల్లీకి వలస వెళ్ళిపోయింది. అక్కడ మధుర రోడ్ లోని ఢిల్లీ  పబ్లిక్ సూలులో చేరారు వినోద్. 1960లో తిరిగి ముంబైకు మారిపోయింది వారి కుటుంబం. ఆ తరువాత నాసిక్ లోని బార్నెస్  స్కూలు లో హాస్టల్ లో ఉండి  చదువును కొనసాగించారు. హాస్టల్  లో ఉండే సమయంలో వినోద్ సోల్వా సాల్, మొఘల్-ఎ-అజం సినిమాలు చూశారు. దీంతో వినోద్ కు సినిమాలపైన ఆసక్తి పెరిగింది. ఢిల్లీలోని సిడెన్హమ్ కళాశాల నుండి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. సునీల్ దత్ హీరోగా నటించిన మన్ కా మీట్ (1968) సినిమాలో విలన్ గా నటించారు వినోద్. ఇదే ఆయన మొదటి సినిమా. కెరీర్ మొదట్లో 1970లో విడుదలైన పూరబ్ ఔర్ పశ్చిమ్, సచ్చా ఝూటా, ఆన్ మిలో సజ్నా, మస్తానా, 1971లో విడుదలైన మేరా గోన్ మేరా దేశ్, ఎలాన్ వంటి సినిమాల్లో సహ యనటుని పాత్రలు, ప్రతినాయక పాత్రలు చేశారు. బాలీవుడ్ లో మొదట విలన్ పాత్రలు ఆ తరువాత హీరో పాత్రలు వేసిన అతి తక్కువమంది నటుల్లో వినోద్ ఒకరు. 1971లో మొదటిసారి హమ్ తుమ్ ఔర్ ఓ సినిమాతో హీరో అయ్యారు వినోద్. ఆ తరువాత గుల్జార్ దర్శకత్వంలో మల్టీ హీరోగా మేరే అప్నేలో చేశారు. 1973లో గుల్జార్ దర్శకత్వంలోనే వచ్చిన అచానక్ సినిమాలో చివరికి చనిపోయే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ కథ మహారాష్ట్ర కు చెందిన కమాండర్ కె.ఎం.నానావతి  నిజ జీవిత కథ. ఈ సినిమాలో నానావతి పాత్రను పోషించారు వినోద్. 1973 నుండి 1982 మధ్య చాలా సినిమాల్లో హీరో పాత్రలు పోషించారు ఆయన. ఫరేబీ, కాయిద్ (1975), జాలిమ్ (1980), ఇన్కార్ (1978),  వంటి సినిమాల్లో నటించారు. 1980లో ఫిరోజ్ ఖాన్ తో కలసి నటించిన కుర్భానీ ఆ సంవత్సరంలోనే అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. శశి కపూర్తో కలసి శంకర్ శంభు, చోర్ సిపాహీ, ఏక్ ఔర్ ఏక్ గ్యారాహ్ వంటి సినిమాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్తో కలసి హీరా ఫేరీ, ఖూన్ పసీనా, అమర్ అక్బర్ ఆంతోనీ, మకద్దర్ కా సికందర్ వంటి సినిమాల్లో కనిపించారు. రణధీర్ కపూర్ తో హాత్ కీ సఫాయీ, ఆఖరీ డాకూ వంటి సినిమాల్లోనూ, సునీల్ దత్ తో కలసి  డాకూ ఔర్ జవన్ సినిమాల్లో నటించారు వినోద్. రాజేష్ ఖన్నా హీరోగా నటించిన సచ్చా ఝూటా, ప్రేమ్ కహానీ, కుద్రత్, రాజ్ పుత్ సినిమాల్లో సహాయనటునిగా కనిపించారు ఆయన. ఓషో కు శిష్యునిగా మారిన వినోద్, 1982 తరువాత దాదాపు 5 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. 1987లో తిరిగి డింపుల్ కపాడియాతో కలసి చేసిన ఇన్సాఫ్  సినిమాతో తిరిగి బాలీవుడ్ లో అడుగుపెట్టారు ఖన్నా. తిరిగి వచ్చిన తరువాత జుర్ం, చాందినీ వంటి సినిమాల్లో రొమాంటిక్  పాత్రలు చేసినా ఎక్కువగా యాక్షన్ ప్రధానమైన సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. ముజఫర్ అలీ దర్శకత్వంలో, డింపుల్ కపాడియాతో కలసి చేసిన జూనీ సినిమా ఇప్పటికి విడుదలకు నోచుకోలేదు. 1990లో ముకద్దర్ కా బాద్షా, సిఐడి, జుర్ం, రిహే, లేకిన్, హంషకల్ వంటి సినిమాల్లో నటించారు ఖన్నా. ఖూన్ కా కర్జ్, పోలీస్ ఔర్ ముజ్రిమ్, క్షత్రియా, ఇన్సానియత్ కే దేవతా, ఎక్కా రాజా రాణీ, ఏనా మీనా డీకా వంటి మల్టీ స్టారర్ సినిమల్లో రెండో హీరోగా నటించారు. 2002లో విడుదలైన క్రాంతి సినిమా కూడా ఈ కోవకు చెందినదే. 1997లో తన కుమారుడు అక్షయ్ ఖన్నాతో కలసి హిమాలయ్ పుత్ర సినిమాలో నటించడమే కాక, ఆ సినిమాను నిర్మించారు వినోద్. 1999లో వినోద్ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2000వ దశకంలో దీవానాపన్ (2002), రెడ్ అలర్ట్:ది వార్ వితిన్, వాంటెడ్ (2009), దబాంగ్ (2010) వంటి సినిమాల్లో నటించారు. హీరోగా పెహచాన్:ది ఫేస్ ఆఫ్ ట్రూత్ (2005), పాకిస్థానీ చిత్రం గాడ్ ఫాదర్ (2007) వంటి సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. రిస్క్ (2007) మల్టీస్టారర్ సినిమాలో కూడా కనిపించారు వినోద్. 9X చానల్ లో స్మృతి ఇరానీ నిర్మించిన మేరే ఆప్నే సీరియల్ లో  కాశీనాథ్  పాత్రలో నటించారు వినోద్. 1997లో వినోద్ భారతీయ జనతా పార్టీలో చేరి, తరువాతి సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని  గుర్దాస్ పూర్ నియోజకవర్గం నుంచి  లోక్ సభకు ఎన్నికయ్యారు. 1999లో అదే నియోజకవర్గం నుంచీ  తిరిగి లోక్ సభ స్థానం గెలిచారు వినోద్. జులై 2002లో సాంస్కృతిక,  పర్యాటక శాఖ కేంద్రమంత్రిగా పనిచేశారు ఆయన. 6 నెలల తరువాత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా మారారు. 2004లో గుర్దాస్ పూర్ లో జరిగిన రీఎలక్షన్స్ లో కూడా గెలిచారు. 2009 లోక్ సభా ఎన్నికల్లో  ఓడిపోయినా, 2014 సాధారణ ఎన్నికల్లో తిరిగి గుర్దాస్ పూర్  నియోజకవర్గం నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. 1971లో వినోద్ గీతాంజలిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా. 1975లో వినోద్ ఓషోకు శిష్యునిగా మారారు. ఆ సమయంలో కొన్నేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు ఆయన. 1980లో అమెరికాలోని ఓషోకు చెందిన రజనేష్ పురానికి వెళ్ళి, గిన్నెలు కడగడం, తోటపని చేయడం వంటి పనులు చేస్తూ నిరాడంబర జీవితం గడిపారు ఆయన. ఆ సమయంలో భార్యకు, ఆయనకు గొడవలై అది విడాకులకు దారి తీసింది. 1990లో కవితాను వివాహం చేసుకున్నారు వినోద్. వీరికి ఒక కుమారుడు సాక్షి, కుమార్తె శ్రద్ధ.

Post a Comment

0Comments

Post a Comment (0)