అబార్షన్‌ నిబంధనల్లో మార్పు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 31 October 2021

అబార్షన్‌ నిబంధనల్లో మార్పు


మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (సవరణ) చట్టం- 2021 ద్వారా అబార్షన్‌ కాలపరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గర్భాన్ని తొలగించుకునే కాలపరిమితిని 20 నుంచి 24 వారాలకు పెంచింది. ఇందులో మైనర్ల ప్రత్యేక కేటగిరీగా గుర్తించింది. వారికి అబార్షన్‌ సేవలను సత్వరంగా అందుబాటులో ఉంచాలని అందులో పేర్కొంది. అయితే ఇందుకు పలు సామాజిక అంశాలు, చిన్నారులపై లైంగిక వేదింపులకు సంబంధించిన పోస్కో చట్టం-2012లోని అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. ఇప్పటి వరకు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న గరిష్ఠ పరిమితిగా ఉన్న 20 వారాల నిబంధనలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా గర్భిణులు కొన్ని అనివార్య కారణాల వల్ల అబార్షన్‌ చేయించుకోవాలనుకుంటే గర్భం దాల్చిన 20 వారాల లోపే చేయించుకోవాలి. ఈ గడువు దాటితే చట్టప్రకారం అబార్షన్‌ చేయరు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన రూల్స్‌ ప్రకారం కొన్ని కేటగిరీ మహిళలకు అబార్షన్‌ గరిష్ఠ పరిమితి 24 వారాలకు పెరిగింది. వీరిలో మైనర్లు, అత్యాచారానికి గురైనవారితో పాటు కడుపులో ఉన్న బిడ్డ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళలు ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరు డాక్టర్ల అనుమతి మేరకు అబార్షన్‌ చేయించుకోవచ్చని తెలిపింది. ఇతరులు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఒక వైద్యుని అనుమతితో 20 వారాల్లోపు అబార్షన్‌ కోరవచ్చని పేర్కొంది. ఇంతకుముందు 12 వారాల్లోపు అబార్షన్‌ చేయించుకోవాలంటే ఒక డాక్టర్‌ అనుమతి, 12 నుంచి 20 వారాల గర్భాన్ని తీయించుకోవాలనుకుంటే ఇద్దరు వైద్యుల అనుమతి అవసరం ఉండేది. పిండం అసాధారణ పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో సదరు గర్భిణి 24 వారాల తర్వాత గర్భం తొలగించుకోవచ్చో లేదో నిర్ణయించడానికి రాష్ట్రస్థాయి మెడికల్‌ బోర్డులను ఏర్పాటు చేయడానికి సవరించిన చట్టం అనుమతిస్తోంది. 20 వారాల తర్వాత కూడా గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధిక సంఖ్యలో మైనర్లు కోర్టులను ఆశ్రయిస్తుండ డంతో వారిని ప్రత్యేక కేటగిరీగా చేర్చింది. పిండం అసాధారణతలు, అత్యాచార బాధితుల తర్వాత వీరు మూడో కేటగిరీలో ఉన్నారు. అబార్షన్‌ సేవలను అందించడంలో పోస్కో చట్టం ద్వారా ఎదురవుతున్న అడ్డంకులను పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం మైనర్‌ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిసిన ఏ వ్యక్తి అయినా.. అది ఏకాభిప్రాయంగా జరిగినది అయినా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. పోస్కో చట్టం సమ్మతి వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఈ చట్టం కారణంగా అబార్షన్‌ కోరుకునే మైనర్ల శాతంలో తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. పోలీసుల వేధింపులకు గురికాకుండా మైనర్లు సురక్షితంగా గర్భాన్ని తొలగించుకునేలా పరిష్కారం కనుగొనాల్సి ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిక్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ప్రధాన కార్యదర్శి ఎంటిపి చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నోజర్‌ షెరియార్‌ చెప్పారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-4 (2015-2016) ప్రకారం, 20 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో 18 సంవత్సరాల కంటే ముందు వివాహం చేసుకున్న వారు 27 శాతం ఉండగా, 15 నుంచి 19 ఏళ్ల వారిలో 8 శాతం ఉంది తల్లి అవడమో లేదా గర్భిణిగా ఉన్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 (2019-2020) దేశవ్యాప్త డేటా ఇంకా విడుదల కానప్పటికీ, 22 రాష్ట్రాల డేటాను మొదటి రౌండ్‌లో విడుదల చేశారు. దీని ప్రకారం.. 17 రాష్ట్రాల్లో బాల్యవివాహాలు తగ్గగా, మూడు రాష్ట్రాల్లో పెరిగాయి. 16 రాష్ట్రాల్లో టీనేజ్‌ గర్భాలు తగ్గగా, ఆరు రాష్ట్రాల్లో పెరిగాయి.


No comments:

Post a Comment