కొవిడ్‌ తో చేతులు, పాదాలపై దద్దుర్లూ రావొచ్చు...!

Telugu Lo Computer
0

కొవిడ్‌-19 దుష్ప్రభావాల్లో భాగంగా చేతులు, పాదాలపై ఎరుపు దద్దుర్లు, వాపు కూడా వచ్చే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వివరాలు 'బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ డెర్మటాలజీ'లో ప్రచురితమయ్యాయి. కొవిడ్‌ సోకిన 1 నుంచి 4 వారాల్లో ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో చేతులు, కాలి వేళ్లపై వాపు, రంగు మారడం, ఎరుపు దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈమేరకు పలు కొత్త అంశాలు తేలినట్లు సీనియర్‌ అధ్యయన కర్త డాక్టర్‌ ఛార్లెస్‌ కాసియస్‌ తెలిపారు. అయితే ఇలాంటి లక్షణాలు చాలామేర కొద్ది రోజుల్లో తగ్గిపోతాయని, కొన్ని కేసుల్లో మాత్రం నెలల తరబడి ఈ పరిస్థితి ఉంటుందని వివరించారు. అధ్యయనంలో భాగంగా పలువురికి రక్త, చర్మ పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి లక్షణాలు కనిపించడానికి రోగనిరోధక వ్యవస్థలోని రెండు భాగాలు కారణాలుగా గుర్తించారు. వీటిలో ఒకటి టైప్‌-1 ఇంటర్‌ఫెరెన్‌గా పిలిచే యాంటీవైరస్‌ ప్రొటీన్‌. రెండోది ఓ యాంటీబాడీ. ఇది పొరపాటున సంబంధిత వ్యక్తుల్లోని సొంత కణాలు, టిష్యూలనే లక్ష్యంగా చేసుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తనాళాలకు ఆనుకుని ఉండే కణాలు కూడా ఇందుకు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌ ప్రారంభంలో చాలామంది బాధితుల్లో ఈ లక్షణాలు తరచుగా కనిపించేవని.. అయితే ప్రస్తుతం తీవ్రత తగ్గినట్లు బ్రిటిష్‌ స్కిన్‌ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి డాక్టర్‌ వెరోనిక్‌ బాటైల్లే తెలిపారు. ఇందుకు టీకాలు తీసుకోవడం, గత ఇన్‌ఫెక్షన్ల నుంచి కొన్ని రక్షణలు పొందడం వంటివి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)