భక్తి సామ్రాజ్యం

Telugu Lo Computer
0

 

భగవంతుణ్ని చేరాలనుకునేవారికి నవవిధ భక్తులనే తొమ్మిది మార్గాల గురించి చెబుతారు. అందులో ఏ మార్గానికైనా గమ్యం పరంధాముడే. తీర్థయాత్రకు, భక్తిమార్గ యాత్రలకు సంబంధం లేదు. ఒకటి శరీరంతో చేసే భౌతిక యాత్ర, రెండోది ఆత్మతో చేసే అంతరంగయాత్ర. భౌతిక యాత్రలో శరీర శ్రమ ఉంటుంది. అంతరంగ యాత్రలో అంతఃకరణ శుద్ధి కోసం అనేక అవస్థలుంటాయి. మనో చాంచల్యమే మొదటి సమస్య. ఆ సమస్యను అధిగమించగలిగితే, అంతగా బాధించగల ఇతర సమస్యలుండవు. భగవంతుణ్ని చేరడానికి జ్ఞాన, భక్తి మార్గాల్లో ఏది గొప్పది? గొప్పదనం మార్గంలో ఉండదు. మన ఆచరణ, అంకిత భావాల్లో ఉంటుంది. కొందరు జ్ఞానమార్గం ఎంచుకుంటారు. తరచి తరచి ఆధ్యాత్మిక రహస్యాలను అన్వేషిస్తారు. వంటను ఎన్ని పద్ధతుల్లో రుచికరంగా చెయ్యవచ్చో జ్ఞానం చెబుతుంది. పట్టెడు మెతుకులు పట్టే పొట్టకు తినేదాకానే ఆరాటం. అటు తరవాత మనసు మరో విషయం మీదకు మళ్లిపోతుంది. భక్తి- బీద కుటీరంలో పేదరాలి ప్రేమవంటకం లాంటిది. శబరి ఎంగిలి పళ్లవంటిది. విదురుడు శ్రీకృష్ణుడికి సమర్పించిన అరటితొక్క లాంటిది. భక్తికి ఆడంబరాలుండవు. భగవంతుడి వద్ద భక్తికి కొలమానం ఉంది. ఆ కొలమానం ప్రకారమే ఆయన స్పందన ఉంటుంది. భక్తి వినా సన్మార్గం లేదంటాడు త్యాగయ్య. పరమాత్మకు మనం చేసే ప్రతి సేవలోనూ భక్తి మిళితమై ఉండాలి. అప్పుడే అది స్వామిస్వీకారానికి అర్హత పొందుతుంది. తీపి కలపని పానీయం లాంటిదే, భక్తిలేని పూజ. చాలామంది తమంత భక్తులు తామే అనే భ్రమలో జీవిస్తుంటారు. ఎవరికి వారు తమ భక్తిని పరీక్షించుకుని తామే మూల్యాంకనం చేసుకుంటే, ఇక పరమాత్మ నిర్ణయించాల్సింది ఏముంటుంది? పాలు-పెరుగు-వెన్న లాంటి దశలు దాటడమే నిజభక్తి. పరమాత్మను వెన్నదొంగ అనడంలో అర్థం, మనలోని భక్తిని కుచేలుడి చెంగులోని అటుకులు లాక్కున్నట్టు స్వీకరిస్తాడనే. భగవంతుడు ఏది స్వీకరించినా అందుకు ప్రతిఫలం ఊహించలేనంత గొప్పగా ఉంటుంది. కుచేలుడి కథే అందుకు ఉదాహరణ. మనం ఇచ్చే ఫలం బావుంటే, ప్రతిఫలం మరింత బావుంటుంది. చాలామంది చవకబారుతనమంతా పూజాసామగ్రిలోనే చూపిస్తారు. శక్తి ఉన్నా, ధనం ఉన్నా- దానం చెయ్యడానికి వారి మనసొప్పదు. ఈ గుంజాటనలో ఉన్నంతకాలం భగవంతుడు మనల్ని పట్టించుకోడు. భగవంతుణ్ని మనం కోరికలే కోరుతున్నాం. ఆయన అనుగ్రహం రాలేదని చింతిస్తుంటాం. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే స్వచ్ఛమైన భక్తి కావాలి. మన మనసుకు అదేమిటో నేర్పాలి. అందుకని వివేకంతో, వివేకానందుడిలా ‘వినిర్మల భక్తిజ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించ’మని అర్థించాలి. ఇంతకంటే గొప్పవరం మరొకటి ఉండదు. ఎందుకంటే, ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా భగవంతుడితో మన బంధం బలహీనమైపోతుంది. మనం మరో దేశంలోకి ప్రవేశించాలంటే, అక్కడి ప్రభుత్వం అనుమతించాలి. అలాంటి అనుమతికి కొన్ని అర్హతలుండాలి. భక్తి సామ్రాజ్యంలో ప్రవేశానికీ ఇది వర్తిస్తుంది. ఎలాంటి అర్హతలు ఉండాలో కబీరు, రామదాసు వంటి భక్తుల జీవితాలు వెల్లడిస్తాయి. మనం ఇతరుల్లోని ప్రత్యేకతలను, వేషభాషల్ని, అలంకారాలను అనుకరించడానికి ఆరాటపడతాం. కోయిలకూతనూ అనుకరించి ఆనందపడతాం. కానీ, మహాభక్తుల అడుగుజాడల్ని అనుసరించేందుకు ఆసక్తి చూపించం. జీవిత చరిత్రల్ని ఆచరణ సాధ్యం చేసుకోకుండా కేవలం చదివితే ఏమిటి ఉపయోగం? మధురమైన మామిడి రసాలను చూసినంతలో కడుపు నిండదు. సేవించి ఆస్వాదిస్తేనే ఆనందం కలుగుతుంది. అలాగే భక్తిరస రుచులను స్వయంగా ఆస్వాదించి దైవానుబంధంతో తాదాత్మ్యం చెందాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)