గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు

Telugu Lo Computer
0

 

డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్ సింగ్ కేసులో ఈ బాబా పాత్ర ఉన్నట్లు హరియాణాలోని పంచకులలోని సీబీఐ న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ హత్యకేసులో హస్తం ఉన్నట్లు తేల్చిన న్యాయస్థానం.. సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఆ నలుగురికి కూడా జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షలో భాగంగా కోర్టు దోషులకు జరిమానా విధించింది. డేరా బాబా రూ.31లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగతా నలుగురు లక్షన్నర నుంచి 75 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో కొంత భాగం రంజిత్ కుటుంబానికి వెళ్లనుంది. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరో నిందితుడు ఇదివరకే ప్రాణాలు కోల్పోయాడు. డేరా బాబాకు అనుచరుడిగా ఉన్న రంజిత్‌ సింగ్‌ 2002లో హత్యకు గురయ్యారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ విడుదలైన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌గా ఉన్న రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. దీంతో ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. ఆ హత్యకేసులో భాగస్తులైన వారిని ఇటీవల దోషులుగా తేల్చి, ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. డేరా బాబా ఓ అత్యాచార కేసులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)