హైదరాబాద్‌లో భారీ వర్షం..!

Telugu Lo Computer
0


భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుముల థాటికి నగరవాసులు బయపడిపోతున్నారు. ఇంటి నుంచి బయటికెళ్లిన జనాలు తిరిగి ఇంటికెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. మరికాసేపట్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లో సూచికను కూడా జారీ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం రోజు భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కేరళలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. రాజధాని నగరమైన హైదరాబాద్ నగరంలో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇవాళ ఉదయమే ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)