అంతరపంటగా గంజాయి సాగు

Telugu Lo Computer
0
తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నిషేధిత గంజాయి సాగు విచ్చల విడిగా సాగుతోంది. పత్తి, కంది వంటి పంటల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని కొందరు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు లబ్దిపొందుతున్నారు. అటు పోలీసులు కూడా నిఘాను పెంచి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్ మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో రైతులు సాగుచేస్తున్న వివిధ పంటల్లో అంతర పంటగా ఈ గంజాయిని సాగు చేస్తున్నారు.ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి సాగు వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ నాయక్ తాండ శివారులోని రైతు తిరుపతి తన చేనులో సాగుచేస్తున్న పత్తిపంటలో గంజాయిని అంతర పంటగా సాగుచేస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సుమారు 300 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో సాగుచేస్తున్న గంజాయిని మహారాష్ట్రలోని ముంబాయి, నాగపూర్, పూనే, ఢిల్లి, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక రైతుల నుండి కిలో ఐదు వేల రూపాయలకు తీసుకొని ఇతర ప్రాంతాలకు పది వేల రూపాయల చొప్పున విక్రయించి లబ్దిపొందుతున్నరనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఉమ్రి(బి) పంచాయతీ పరిధిలో పత్తి పంటలో కందితోపాటు సాగు చేస్తున్న 70 గంజాయి మొక్కలను స్పెషల్ బ్రాంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని కాల్చి వేశారు. బాధ్యులపై కేసు కూడా నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురు పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా మావల నుండి ఆదిలాబాద్ వైపు వచ్చిన ఆటోను తనిఖీ చేసి, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితులను విచారించగా గంజాయి విక్రయం వ్యవహారం బయటపడింది. నిందితులు తమ జేబుల్లో గంజాయి ప్యాకెట్లను (ganja pockets ) దాచుకొని ఆదిలాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి నుండి కిలోన్నర గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 4500 రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అడపాదడపా పోలీసులకు అందిన సమాచారం మేరకు, వాహనాల తనిఖీల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేసి మారుమూల ప్రాంతాలపై దృష్టి పెడితే గంజాయిని కట్టడి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)