సూరత్‌ ప్యాకేజింగ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీఐడీసీ కడోదరలో ఉన్న ఓ ప్యాకేజింగ్‌ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు లేచాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. పరిశ్రమలో పనిచేస్తున్న 125 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐదంతస్థుల్లో ఉన్న ఈ పరిశ్రమలో అగ్నికీలలు చుట్టుముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది ఐదు, నాలుగు అంతస్తుల నుంచి కిందికి దూకారు. దాంతో పలువురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. సమాచారం అందుకున్న సూరత్‌ ఫైర్‌ బ్రిగేడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 10 అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పడానికి పెట్టారు. మూడున్నర గంటల సేపు ప్రయత్నించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. రక్షించిన వారిలో దాదాపు 20 మంది శరీరం కాలిపోయిందని, వీరిని వివిధ దవాఖానల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరగడానికి గల కారణాలు ఇప్పటికిప్పుడు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంటలు రావడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మంటలు ఉధృతంగా ఉన్న సమయంలో పలువురు ఐదో అంతస్థు నుంచి దూకారని, తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐదో అంతస్థలో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)