"మా" పోలింగ్ టెన్షన

Telugu Lo Computer
0


మా ఎన్నికల్లో చివరి ఘట్టంగా ఇవాళ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతున్నది. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. సాయంత్రం నాలుగులోగా ఫలితాలు వెల్లడవుతాయి. అయితే, ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి కేంద్రం వద్ద రెండు ప్యానెళ్లకు చెందిన ప్రతినిధులు తీవ్రస్థాయిలో గొడవలు పడుతుండటంతో ఎన్నికల వాతావరణానికి విఘాతం ఏర్పడింది. ప్రకాశ్ రాజ్ తరఫున బయటి వ్యక్తి ఒకరు రిగ్గింగ్ కు పాల్పడ్డాడని మంచు విష్ణు బృందం ఆరోపించడంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. రిగ్గింగ్ వ్యవహారంపై బయట కూడా వాగ్వాదాలు నడిచాయి. ఈ క్రమంలో.. మా పోలింగ్ వేళ గొడవలు, హింసపై ఎన్నికల అధికారులు తీవ్రంగా స్పందించారు. గొడవలు, ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తామని 'మా' ఎన్నికల అధికారి ఫైరయ్యారు. 'గొడవలు కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తాం.. పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి. ప్రకాష్‌రాజ్ తరపున ఒకరు దొంగ ఓటు వేశారని విష్ణు ప్యానెల్ ఫిర్యాదు చేశారు. అలాగే, బయట మోహన్‌బాబు ఇతరులపై అరుస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. పోలింగ్ కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే మాకు(అధికారులకు) ఇవ్వండి. అంతేకానీ అరుపులు, రాద్ధాంతాలు చేయొద్దు' అని ఎన్నికల అధికారి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ఓటింగ్ కేంద్రం లోపలికి వచ్చి ప్రచారం చేయాలని ఎవరైనా చూస్తే పోలింగ్ మొత్తాన్ని రద్దు చేస్తాం. ఇప్పటిదాకా పోలైన ఓట్ల ఆధారంగా ఫలితాలను కూడా వెల్లడించబోము. రిగ్గింగ్, ఇతర వ్యవహారాలపై కోర్టును ఆశ్రయిస్తాం. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించే ప్రయత్నం చేస్తాం'అని ఎన్నికల అధికారి వ్యాఖ్యానించారు. మా ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్, పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై ఎన్నికల అధికారులు.. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు బృందాలను పిలిపించి మాట్లాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)