పేటీఎం ఐపీఓ మరింత పెరిగే సూచనలు?

Telugu Lo Computer
0


వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీఓ పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలుత రూ.16,600 కోట్లు సమీకరించే అవకాశం ఉందని భావించినా.. అది రూ.18,300 కోట్లకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న అలీబాబా గ్రూప్‌ కంపెనీ యాంట్‌ఫిన్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ విక్రయించాలనుకుంటున్న వాటాలను మరింత పెంచడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. పేటీఎం సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం  తాజా ఈక్విటీ షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు; ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా మరో రూ.8,300 కోట్లు సమీకరించాలని భావించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఓఎఫ్‌ఎస్‌ పరిమాణం మరో రూ.1,700 కోట్ల పెరిగి రూ.10,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఓఎఫ్‌ఎస్‌ పరిమాణంలో దాదాపు సగం విలువ యాంట్‌ఫిన్‌ గ్రూప్‌దేనని తెలుస్తోంది. అలీబాబా గ్రూప్‌ కంపెనీలతో పాటు పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ, ఎలివేషన్‌ క్యాపిటల్ V FII హోల్డింగ్స్‌, ఎలివేషన్‌ క్యాపిటల్‌ V, సైఫ్‌ III మారిషస్‌ కంపెనీ, సైఫ్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా IV వంటి కీలక కంపెనీలు ప్రతిపాదిత ఓఎఫ్‌ఎస్‌లో కొంత వాటాను విక్రయించనున్న విషయం తెలిసిందే. పేటీఎం ప్రొఫెషనల్లీ మ్యానేజ్డ్‌ కంపెనీగా మార్కెట్లో లిస్టవనుంది. సెబీ మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి కంపెనీలో ఏ ఒక్క సంస్థకు 25 శాతానికి మించి వాటాలు ఉండకూడదు. ప్రతిపాదిత ఐపీఓ విజయవంతమైతే భారత్‌లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇదే అవుతుంది. 2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీఓనే ఇప్పటిదాకా అతిపెద్దది. 

Post a Comment

0Comments

Post a Comment (0)