దళపతి సాగరం

Telugu Lo Computer
0


కాకతీయుల నగర నిర్మాణ నిబంధనల్లో నగరానికి అనుబంధంగా కోవెల, కోనేరు వుండాలనుకునేవారు. త్రాగునీటి, సాగునీటి అవసర దాహం తీరితేనే ప్రజలు భౌతికంగా సౌకర్యంగా వుంటారు.  ఖ్లేశాలు లేకుండా, మూర్తిమత్వ అభ్యున్నతి ఉంటేనే ఆధ్యాత్మిక దాహం తీరి మానసికంగా సుఖంగా వుంటారు. కాకతీయ సామ్రాజ్యం నుంచి దూరంగా వచ్చినా ఆ ఆలోచనా విధానానికి పరిపాలనా పద్ధతికి దూరం కాలేదు కాబట్టే వంశ పారంపర్యంగా నిబద్ధమైన సూత్రాలుగా భావించిన వాటిని గిరిజన నేల మీద కాలు మోపిన తర్వాత కూడా ఆచరించినట్లున్నారు. అన్నమదేవుని వారసుడు దళపతి దేవుని పేరు మీది దళపతి సాగరం జగదల్ పూర్ కోటను దాదాపు అనుకునే ఉంటుంది. 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సరస్సు 350 హెక్టార్ల విస్తీర్ణంతో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం మొత్తంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు.  చెరువులను సాగరాలుగా పిలవడం కాకతీయ శాసనాలలో గమనిస్తాం. పేరు లోనో అదే పరంపర కొనసాగినట్లుంది. పైగా ఈ సరస్సు మధ్యలో ఒక చిన్న ద్వీపం పై పాత ఆలయం అందులో స్థానిక దేవత వున్నారు. కానీ ఏదన్నా పడవ లాంటి వాటిపై మాత్రమే అక్కడికి చేరుకోగలం.  ప్రస్తుతం గుర్రపు డెక్క మురికి తో కొంచెం మూసి వాసన వేస్తోంది కానీ ఆధునికీకరణ పనులు ప్రారంభం అయ్యాయి. మ్యూజికల్ లైట్, హై మాస్ట్ లైట్స్ పూర్తయ్యింది.  బహుశా త్వరలో మరిన్ని  హంగులతో మరింత పర్యాటక ఆకర్షణ పెంచుకుంటుంది కావచ్చు. నడక దారి, లాఫింగ్ క్లబ్, లతో పాటు వాటర్ స్పోర్ట్స్ కయాకింగ్ లో శిక్షణ నడుస్తోంది. సింగల్ సీటర్, డబల్ సీటర్ లలో కొందరు పిల్లలు నీటిని చీల్చుకుంటూ ఊరుకుతుంటే, రో హ్యాండ్లింగ్ నేర్చుకునే పిల్లలు వట్టి కర్రను పద్దతిగా కోచ్ చెప్పిన లెక్కప్రకారం తిప్పుతున్నారు. గాలాలకు చిక్కని చేపల వైపు హాబి జాలరులు నిరాశగా చూసినట్లు, మంచు వల్ల లో లైట్ అంటూ చూపించే నా కెమెరా వైపు దీనంగా చూసుకుంటూ అబ్బి అబ్బని dslr నైపుణ్యాల తో కొన్ని క్లిక్కాను. ఉదయాన్నే అన్నింటికన్నా అసలు ముచ్చటేమిటంటే మంచులో తడిసి మనదగ్గర లాగానే వేడి వేడిగా ఒక గరం చాయ్ తాగుదాం అని ఎన్ని వీధులు చూసినా దొరకనే లేదు. పాస్ టైం ఆక్టివిటీ గా పోస్ట్ రాసుకోవడం మాత్రం మిగిలింది. అంతే కదా వ్యవసాయానికో వృత్తి పనులతో వెళ్లడం అలవాతాయిన తెగలు వీళ్ళు, ఖాళీగా రోడ్డు కొచ్చి ముచ్చట్లు అడ్డు కుంటూ టీ చప్పరించడం కన్నా చెయ్యాల్సిన ముఖ్యమైన పనుల్లో మునుగుతో వుండే అలవాటు కదా. సినిమా పోస్టర్లు, ఇస్త్రీ షాపులు, షూ పోలిష్ వాలా సీరియల్ హోర్డింగ్ లు పెద్దగా కనిపించక పోవడానికి నిరంతరం నిండి ఉన్న పని సంస్కృతీ కారణం కావచ్చు అనుకుంటున్నాను. హై వే రోడ్డు మార్గాలు ఎగుడు దిగుళ్ళు తగ్గించుకుని నునుపెక్కాక నెమ్మదిగా ఆ తోవలో ఈ అలవాట్లు వాళ్ళ రోజులోకి పాక్కుంటూ వస్తాయేమో అని భయమేస్తోంది కానీ రద్దు వైపు కోపంగా చూడలేనుకదా. పాన్ మసాలా పాకెట్ల వైపు చూసినట్లు.  ప్రజల జీవనం పక్కన తాగునీళ్ల తావు నిజంగా స్వచ్ఛ మైనది ఉంచగలిగితే చాలు ఎడగబోయే తరాలు కూడా నిటారుగా ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)