ఇది విన్నారా..?

Telugu Lo Computer
0



అక్కడ డబ్బులు మీ ముఖమే చెల్లిస్తుందట.. కార్డులూ, ఫోన్ పే, టికెట్​లు అవసరమే లేదు.. ఎక్కడో తెలుసా..? మామూలుగా మనం రైలు, బస్సు, మెట్రో రైలు, విమానాల్లో ప్రయాణాలు చేయాలంటే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటాం. కొన్ని మెట్రోలు అయితే ప్రయాణం చేయడానికి నెలవారీ కార్డులు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి. మెట్రో స్టేషన్లోకి ప్రవేశించే ముందే కార్డును ఉపయోగించడం ద్వారా ప్రయాణం చేసే వెలుసుబాటు వచ్చింది. అయితే రష్యా రాజధాని మాస్కోలో ప్రజా రవాణా వ్యవస్థ మెట్రో అధికారులు మరో ముందడుగేశారు.ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపులు చేసే వెలుసుబాటు కల్పించారు. దీంతో ప్రయాణం మరింత సులువైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా మాస్కో మెట్రో అధికారులు 240 స్టేషన్లలో ఫేషియల్ ఐడీద్వారా చెల్లింపులు చేసే వ్యవస్థను శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలాంటి వ్యవస్థ ఇంత వరకు ఎక్కడా లేదని తెలిపింది. కోటి 27 లక్షల జనాభా కలిగిన మాస్కో నగరంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వీడియో నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. కోవిడ్ 19 సమయంలో జనం విచ్చలవిడిగా తిరగకుండా నియంత్రించడం, అలాంటి వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించడం, రాజకీయ ర్యాలీలకు హాజరైన నిరసన కారులను గుర్తించడం, వారిని అరెస్టు చేసేందుకు కూడా ఈ వీడియో నిఘా వ్యవస్థ ఉపయోగపడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే వ్యవస్థను ఇప్పుడు ఫేస్ పే చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో మరే నగరంలోనూ లేదని, మొదటి సారిగా మాస్కోలో అందుబాటులోకి వచ్చిందని రాజధాని రవాణా వ్యవస్థ అధిపతి మాగ్జిమ్ లిస్క్సుటోవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫేస్ పే  అనేది ఇష్టమైన వారు చేయవచ్చు. దీనికితోడు గతంలో ఉన్న ఇతర చెల్లింపు వ్యవస్థలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ఫేస్ పే ఉపయోగించుకోవాలనుకునే ప్రయాణీకులు ముందుగా వారి ముఖ చిత్రాన్ని ఇవ్వాలి. బ్యాంకు కార్డులను మాస్కో మెట్రో యాప్ ద్వారా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న వారు ఫేస్ పే ద్వారా టర్నస్టైల్ వద్ద కెమెరాను ఒక్కసారి చూసి మెట్రోలో ఎక్కవచ్చని మాగ్జిమ్ లిస్క్సుటోవ్ తెలిపారు. ప్రయాణీకుల డేటా సురక్షితంగా ఉంటుందని మాస్కో మెట్రో అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)