ఒక్క మాటతో రూ.25 లక్షల కోట్లు ఆవిరి

Telugu Lo Computer
0

 

నోటి మాట ఎంతో విలువైంది. కొన్ని మాటలు మనిషికి గొప్ప పేరు తెచ్చిపెడుతాయి. మరికొన్ని మాటలు అదే మనిషిని మూర్ఖుడిగా నిలబెడుతాయి. కొన్ని మాటలు మనిషికి లాభాలు తెచ్చిపెడుతాయి. మరికొన్ని మాటలు అదే మనిషిని నష్టాలపాలు చేస్తాయి. చైనాకు చెందిన బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడాది క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయేలా చేశాయి. చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురై భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. 2020, అక్టోబర్‌లో చైనాలో ‘ది బండ్ సమిట్‌’ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాక్ మా ఓ ప్రసంగం చేశారు. అందులో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ సలహా ఇచ్చారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఘాటు విమర్శ చేశారు. జాక్‌ మా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆగ్రహం తెప్పించాయి. అందుకే ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. జాక్‌ స్థాపించిన యాంట్‌ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా అడ్డుకుంది. దాంతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా షేర్లు వరుసగా పతనమవుతూ వచ్చాయి. అందుకే అలీబాబా గ్రూప్‌ సంపదతోపాటు జాక్‌ మా నికర సంపద కూడా హారతికర్పూరంలో కరుగుతూ పోయింది. పర్యవసానంగా ఏడాది కాలంలోనే అలీబాబా తన మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. అంటే మన భారత కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ విలువ కూడా ఒక ఏడాదిలో ఇంతలా కరిగిపోలేదట. కాగా, జాక్ మా మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, చైనా ప్రభుత్వ నియంతృత్వ ధోరణివల్ల ఆయన తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)