18 నుంచి పూర్తి కెపాసిటీతో దేశీయ సర్వీసులు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా విధించిన ఆంక్షల్ని కేంద్రం క్రమంగా సడలిస్తోంది. ఇందులో భాగంగా దేశీయ విమాన సర్వీసులు ఇక పూర్తి కెపాసిటీతో రాకపోకలు సాగించబోతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఆంక్షల కారణంగా దేశీయ విమానాలన్నీ పరిమిత సామర్ద్యంతోనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 18 నుంచి షెడ్యూల్డ్ దేశీయ విమానాల్లో ప్రయాణికుల సామర్ధ్యంపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్ర పౌర విమానయాన శాఖ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎయిర్ లైన్ సంస్ధలను కరోనా ముందు స్ధాయికి తీసుకురావడమే కాకుండా డిమాండ్ ఆధారంగా సర్వీసులు నడుపుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కరోనా వ్యాప్తి బాగా తగ్గిన నేపథ్యంలో గతంలో విధించిన ఆంక్షలపై కేంద్రం ఇవాళ సమీక్ష నిర్వహించింది. ఇందులో ప్రయాణికుల సామర్ధ్యంపై విధించిన ఆంక్షలు ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దేశీయ విమానాలు పూర్తి సామర్ధ్యంతో నడిచినా కరోనా నిబంధనలు మాత్రం తూచా తప్పకుండా అమలు చేయాలని ఎయిర్ లైన్ సంస్ధలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో మాత్రం రాజీపడేది లేదని తేల్చిచెప్పింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్ని కేంద్రం సస్పెండ్ చేసింది. కానీ గతేడాది మేలో దేశీయ విమాన సర్వీసులకు తిరిగి అనుమతి ఇచ్చింది. అయితే మూడో వంతు ప్రయాణికుల్ని మాత్రమే రవాణా చేయాలని నిబంధన విధించింది. మరోవైపు కరోనా వ్యాప్తి తగ్గినందున విదేశీ పర్యాటకుల్ని ఈ నెల నుంచి, ఛార్జరేటర విమానాల్లో వచ్చే నెల నుంచి అనుమతించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. పర్యాటక ఆదాయం పెంపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)