ధ్యానం!

Telugu Lo Computer
0




ఒక యువ సన్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు.

భగవంతుడి చిరునవ్వు నవ్వి “నీకేం కావాలి నాయనా ?” అని అడిగాడు.

ఆ సన్న్యాసి “నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది. సత్యాన్ని బోధించండి!” అన్నాడు. 

దానికి భగవంతుడు “చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు. నీరు త్రాగి నీకు బోధిస్తాను!”అన్నాడు.

అక్కడికి దగ్గరగా గ్రామం కానీ, ఇళ్ళు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు. లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.

సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు ,చంద్రబింబం లాంటి ముఖం.

అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు. 

అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది. అంతే తాను వచ్చిన పని మర్చిపోయి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు.

ఆ కన్య అంగీకారంగా తల వూపింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

రోజులు గడిచిపోతున్నాయి. చాలా మంది పిల్లలు కలిగారు. ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.

ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార. ఊరూ వాడ ఏకమై పోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.ప్రవాహం వేగంగా వుంది.

ఎక్కడా గట్టు దొరకడం లేదు. అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. 'భగవంతుడా రక్షించు'అని మొరపెట్టుకున్నాడు..

భగవంతుడు అతడి మొర విని “నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ? “అని అడిగాడు.

ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు.

కాలం లో చిక్కుకొని నివసించడం అలవాటయి పోయింది.

   కల్ కరే సొ ఆజ్ కర్, ఆజ్ కరే సొ అబ్|

    పల్ మే పరలై హోయగీ, బహురీ కరౌగె కబ్||

కబీర్ దాస్ సమయం యొక్క ప్రాధాన్యతను గురించి వివరించారు…

సమయం చాలా అమూల్యమైనది.  గడచిన సమయం మళ్లీ తిరిగి రాదు. కావున రేపు చేయాల్సిన పనిని ఈ రోజు, ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయమని ఉద్బోధిస్తున్నారు. సరైన సమయంలో పనులు చేయనిచో కొన్ని పనులు ఆగి పోతాయి. ఒక్క క్షణంలో ఎప్పుడైనా ప్రళయం సంభవించి ఏ పనులూ పూర్తి చేయకుండానే మరణం సంభవించవచ్చు. ఎందుకనగా జీవితం క్షణభంగురం. కనుక  ఏ పనులనూ ఆలస్యం చేయకుండా  "సకాలంలో పనులు పూర్తి చేయుట" మానవుల ధర్మం.

అందుకే ఇప్పుడే ఈ వర్తమానంలోనే సమయంలోనే…!

మనం ఏమిటి ? మనం ఎవరం?

ఎక్కడి నుంచి వచ్చాం? 

ఎక్కడికి పోతున్నాం?

ఎందు కోసం పుట్టాం

చనిపోయిన తర్వాత ఏమౌతుంది.

ఈ జనన _మరణ చక్ర పరమార్ధం ఏమిటి?

దైవము అంటే ఏమిటి?

ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకుని తదనుగుణంగా జీవించటమే ….

దివ్యజ్ఞాన ప్రకాశం కలిగివుండటం " అంటే!

అందుకే ఇప్పుడే ఈ వర్తమానంలోనే సమయంలోనే ..

ధ్యాన సాధన చెయ్యాలి!* *శ్రీత్యాగరాజస్వామి చెప్పినట్లు “నిద్దుర నిరాకరించి, తంబూర చేపట్టి” అన్నట్లుగా సాధన చేసేవాడే సాధకుడు!

ధ్యానం ద్వారానే  దివ్యత్వాన్ని తెలుసుకుంటాం.

ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా మారి ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యానుల పుస్తకాలు చదవడం ద్వారా, పరోక్షంగా అందరికి పరిపూర్ణ దివ్యజ్ఞాన ప్రకాశం అనతికాలంలో కలుగుతుంది. 

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

Post a Comment

0Comments

Post a Comment (0)