పోలీసుల దాడిలో వ్యాపారవేత్త మృతి

Telugu Lo Computer
0


గోరఖ్‌పూర్‌ హోటల్స్‌పై తనిఖీ చేపడుతుండగా.. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు ముందుకు పడటంతో ఒక వ్యాపారవేత్త మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు తనిఖీల్లో పాల్గొన్న ఆరుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. మరణించిన వ్యక్తి కాన్పూర్‌కి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి మనీష్‌ కుమార్‌ గుప్తాగా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగా గుప్తాపై దాడి చేశారని, అతను మరణించాడని స్నేహితులు పేర్కొన్నారు. వ్యాపారంలో భాగస్వాములైన గుర్‌గావ్‌కి చెందిన ప్రదీప్‌ చౌహాన్‌, హర్దీప్‌ సింగ్‌ చౌహాన్‌లతో కలిసి మనీష్‌కుమార్‌ గుప్తా గోరఖ్‌పూర్‌లోని హోటల్‌లో దిగారు. చందన్‌ సైని అనే స్నేహితుని కలిసేందుకు గోరఖ్‌పూర్‌ వచ్చినట్లు వారు తెలిపారు. నలుగురు స్నేహితులం సోమవారం సాయంత్రం రూమ్‌లోనే ఉన్నామని, మరుసటి రోజు అక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకున్నామని అన్నారు. అర్థరాత్రి దాటాక పోలీసులు ఐడి కార్డు చూపాలని అడిగారని హర్దీప్‌ సింగ్‌ తెలిపారు. రూమ్‌లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించేలోపే తనను చెంప దెబ్బ కొట్టారని అన్నారు. తన ఆధార్‌ కార్డ్‌తో పాటు తమ స్నేహితుడు సైని ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ వదలకుండా గుప్తాను నిద్రలేపి ప్రశ్నలు అడిగారని, ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడగడంతో కొట్టడం ప్రారంభించారని అన్నారు. కొన్ని నిమిషాల అనంతరం నేలమీద పడేసి రూమ్‌ నుండి బయటికి లాక్కెళ్లారని, అప్పటికే అతని ముఖం రక్తంతో నిండిపోయిందన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారని తెలిపారు. కొందరు పోలీసులు మద్యం సేవించి ఉన్నారని సింగ్‌ పేర్కొన్నారు. మనీష్‌ కుమార్‌ గుప్తా అతిగా మద్యం సేవించడంతో అదుపుతప్పి పడిపోయాడని, దీంతో అతని ముఖానికి గాయాలయ్యాయని పోలీసులు ఆరోపించారు. అనుమానిత వ్యక్తులు గోరఖ్‌పూర్‌ హోటల్‌ రూమ్‌లో ఉన్నట్లు సమచారం రావడంతోనే తనిఖీ చేపట్టామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)