మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం

Telugu Lo Computer
0


సమీప భవిష్యత్తులో ఉద్యోగాల్లో స్థిరపడేందుకు యువతకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఇందుకోసం తాజాగా ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ రెండు లేదా అంతకంటే పై సంవత్సరం గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్న వారు దీనికి అర్హులు. ఈ ప్రోగ్రాంను 2022, 2023 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోయే వారు లేదా 2021లో డిగ్రీ పూర్తి చేసిన వారికోసం ప్రత్యేకంగా అందిస్తోంది మైక్రోసాఫ్ట్. 2022-2024 మధ్య దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 15 నుంచి ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్‌ ఉచితంగా ఈ శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు ఎటువంటి వేతనం/ ఉపకార వేతనం ఇవ్వరు అనే అంశాన్ని గమనించాలి. ఈ ఇంటర్న్‌షిప్ కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, ఎర్నస్ట్ & యంగ్ , గిట్ హబ్, క్వెస్ కార్ప్ వంటి సంస్థలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ప్లాట్‌ఫాం ద్వారా మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులతో పాటు సర్టిఫికేషన్స్ సైతం అందిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో శిక్షణను అందించనుంది. ఇందుకోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా ఏఐసీటీఈ ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్‌తో అనుసంధానం చేస్తూ జాతీయ వృత్తివిద్యా ప్రమాణాలకు సంబంధించిన కోర్సుల తీరును నాస్కామ్ అందిస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతికతను ఎర్నస్ట్ & యంగ్ సంస్థ అందించడం మరో విశేషం. డెవలపర్ టూల్స్ కు సంబంధించిన ఉచిత యాక్సెస్ ను గిట్ హబ్ అందిస్తోంది. వీటితోపాటు క్వెస్ కార్ప్.. ఉపాధికి సంబంధించిన తదితర అంశాలపై పనిచేయనుంది. ఈ ప్రోగ్రాంపై ఏఐసీటీఈ ఛీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ స్పందించారు. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని చెప్పారు. అందువల్ల నైపుణ్యాలపై దృష్టి సారించడంతో పాటు ఉద్యోగానికి సిద్ధంగా ఉండటానికి ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోందన్నారు. వీటి ద్వారా యువతకు సాధికారత కల్పించవచ్చని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)