స్థానం నరసింహారావు

Telugu Lo Computer
0


స్థానం నరసింహారావు  ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందారు.స్థానం నరసింహారావు 1902, సెప్టెంబర్ 23 న హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. 1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆ కాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించారు. ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు. వేషధారణ, వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే వారు. సినీ రంగంలో రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని సినిమాలలో నటించారు. తన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని ఆయన రచించారు. 1956లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు, కళాకారుడు. ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది. వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు. వీరి షష్టిపూర్తి మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా హైదరాబాదులో నిర్వహించారు. స్థానం 1971 ఫిబ్రవరి 21 తేదీన మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)