సెకండ్ వేవ్ మధ్యలోనే ఉన్నాం

Telugu Lo Computer
0



దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ..సెకండ్ వేవ్ మధ్యలోనే మనం ఉన్నామని గురువారం కేంద్రఆరోగ్యశాఖ హెచ్చరించింది. తమను తాము కాపాడుకునుందేకు ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ కోరింది. ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పండుగ సీజన్ ముందున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కంటైన్మెంట్ జోన్లలో మరియు 5శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లోని ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడటం వంటివి చేయకూడదని కోరారు. వరుసగా 12వ వారం కూడా దేశవ్యాప్తంగా వారాంతపు పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని..3శాతం కన్నా తక్కువ ఉందని, రికవరీ రేటు 97.8 శాతం ఉందని తెలిపారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన 66 శాతం మంది కనీసం ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన 23శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని రాష్ట్రాల అసాధారణ కృషి వల్లే దీన్ని సాధించగలిగినట్లు రాజేష్ భూషణ్ చెప్పారు. ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో (లక్షద్వీప్, చండీఘర్, గోవా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, సిక్కిం) కరోనా వ్యాక్సిన్ తొలి డోసు నూరు శాతం పంపిణీ జరిగిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో (దాద్రా అండ్ నాగర్ హవేలి, కేరళ, లడఖ్, ఉత్తరాఖండ్) 90 శాతానికి పైగా మందికి వ్యాక్సిన్ మొదటి డోసు అందించినట్లు చెప్పారు. ఇంటింటికీ టీకా కార్యక్రమానికి కేంద్రం అనుమతించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలనూ ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. దివ్యాంగులు, వయోభారంతో బాధపడేవారికి ఇళ్ల వద్దే కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నట్లు వీకే పాల్ చెప్పారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,000 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు కేరళ, మహారాష్ట్రలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గతవారం దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ కేసుల్లో 62.73శాతం కేసులు కేరళ నుంచే నమోదయ్యాయని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)