మల్లినాథ సూరి

Telugu Lo Computer
0

 

ఒకనాడు భోజరాజు కొలువు దీర్చి యుండగా ఒక ద్వారపాలకుడు వచ్చి దేవా! ఎవరో ఒక కవి వచ్చాడు. మీరు కొలువులో వుండగా ఈ తాళపత్రం మీ కివ్వమని యిచ్చాడు అని ఆ తాళపత్రాన్ని అందజేశాడు. సభలో  కాళిదాసు, భవభూతి, దండి, బాణుడు, వరరుచి, మయూరుడు మొదలగు కవులంతా కూర్చుని వున్నారు. ఆ తాళపత్రం మీద ఒక శ్లోకం వ్రాసి వుంది.రాజు దానిని సభికులందరికీ చదివి వినిపించాడు.

కాచిత్ - బాలా,రమణ వసతిం ప్రేషయంతీ కరండం 

దాసీ హస్తాత్, సభయమ లిఖిత్ వ్యాళ,మస్యోపరిష్టాత్ 

గౌరీ కాంతం,పవనతనయం, చంపకం, చా త్ర భావం

పృచ్చ త్యార్యో నిపుణ తిలకో మల్లినాథ: కవీంద్రః

       తా:--- ఒక అబల ఫేము తో చేసిన చిన్న పెట్టెను దాసీ చేతికిచ్చి తన ప్రియుడి యింటికి పంపింది.భయం భయంగా దానిమీద ఒక పాము బొమ్మా,శివుడి బొమ్మ,సంపంగి పూవు బొమ్మా, ఆంజనేయ స్వామీ బొమ్మ చిత్రించింది.దీని భావమేమిటో  చెప్పమని పూజ్యుడూ, కవీశ్వరుడు, బుద్ధిశాలి అయిన మల్లినాథుదు ప్రశ్నిస్తున్నాడు. కాళిదాసు తో సహా కవులందరూ ఆ శ్లోకం విని ముచ్చట పడ్డారు.కాళిదాసు ఆ శ్లోకా ర్థాన్ని యిలా వివరించాడు.

ఆ శ్లోకం పంపింది అష్టవిధ నాయికలలో ఒకరైన "ప్రోషిత భర్తృక.ఈ నాయిక తన ప్రియుడికి దూరంగా వుంటున్న అబల.ఆమెకు అసలే విరహబాధ.ఆ బాధను యింకా పెంచే విషయాలు నాలుగు: చల్లని మలయమారుతం,మన్మథుడు, ఉద్యానవనాలు,తుమ్మెదలు,వాటినుంచి తన్ను కాపాడుకుంటూ వున్నానని సూచిస్తూ ఆ నాలిగింటి శత్రువులను ఆ పెట్టె మీద చిత్రించింది. మలయ మారుతానికి పాము శత్రువు (పాము గాలిని భక్షిస్తుంది కదా!) మన్మథుడికి శివుడు శత్రువు. (ఆయనను భస్మ చేశాడు కదా! )

వుద్యానవనాలకు శత్రువు ఆంజనేయుడు.(లంకలో అశోక వనాన్ని పాడు చేశాడు కదా!)సరే తుమ్మెదలకు ,సంపంగి పూవు కూ సరిపడదనేది తెలిసిన విషయమే.కనుక తనని బాధిస్తున్న విషయాల విరోధి బొమ్మల్ని చిత్రించి తనబాధను తెలియజేసి నాయకుడిని త్వరగా రమ్మని అన్యాపదేశంగా చెప్తున్నది.

ఈ ప్రక్రియను సభలో వున్న కాళిదాసాది కవులంతా మెచ్చుకున్నారు.రాజా!మల్లినాథ కవిని వెంటనే పిలిపించండి అని కోరాడు కాళిదాసు.రాజు భటుడి ద్వారా ఆదేశం పంపించి మల్లినాథుడిని పిలిపించాడు.

రాజు మల్లినాథా! నీ శ్లోకం బాగున్నదయ్యా అన్నాడు కాళిదాసు రాజా! శ్లోకం బాగుంది 

అనడం అల్పోక్తి అద్భుతంగా,అత్యంత శ్ల్యాఘ నీయంగా వుంది.అన్నాడు 

రాజు మల్లినాథుడికి లక్షబంగారు నాణాలు,బహూకరించాడు.

మల్లినాథుడు రాజును స్తుతిస్తూ ఒక చక్కని శ్లోకం ఆశువు గా చెప్పాడు.

దేవ! భోజ! తవ దాన జలౌఘై: సోయమబ్ది రజనీతి విశంకే 

అన్యథా తదుదితేషు శిలా, గో,భూరుహేషు కథ మీ దృశ దానం 

   అర్థము:--ఓ! భోజరాజా! నీవు దానాలు చేస్తూ వదిలిన నీటి ప్రవాహం లో యీసముద్రము పుట్టిందని నేను ఊహిస్తున్నాను.లేకపోతే ఆ సముద్రం నుండి పుట్టిన చింతామణి రత్నం,కామధేనువు,కల్పవృక్షం వీటికి లోకుల కోరికలను తీర్చే దానగుణం ఎలా కలుగు తుంది?నీవు వదిలిన నీటి వల్ల ఏర్పడిన సముద్రం కనుక నీ దాన గుణం వాటికి కూడా అబ్బింది అని భావం 

మల్లినాథుడు నిజానికి కాళిదాసుకు సమకాలికుడు కాదు. మల్లినాథుడు 14 - 15 శతాబ్దానికి చెందినవాడు. సంస్కృతంలో పంచకావ్యాలకు (రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, భారవి వ్రాసిన "కిరాతార్జునీయం," మాఘకవి రచించిన 'శిశుపాలవధ') సమగ్రమైన వ్యాఖ్యలు వ్రాసి వ్యాఖ్యాతృ చక్రవర్తి అని బిరుదు సంపాదించినవాడు.  మల్లినాథుడు పటాన్ చెరువు సమీప ప్రాంతానికి చెందిన వాడని అంటారు.. ఆయనను  భోజుడితో, కాళిదాసుతో కలపటం కేవలం చమత్కారం కోసమే. అని వేరే చెప్పనవసరం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)