ఆడపిల్ల పుడితే రూ.5,116 ఫిక్స్ డ్ డిపాజిట్

Telugu Lo Computer
0


పల్లెల్లో చాలామందికి ఆడపిల్ల  పుడితే.. ఎంతో కొంత నిరాశగా ఉంటారు. వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా క్షేత్రస్థాయిలో ఇలానే ఉంటుంది. ఆడపిల్ల పుట్టిన తల్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'బంగారు తల్లి ' అనే పథకాన్ని ప్రేశపెట్టిన విషయం తెలిసిందే. బంగారు తల్లి పథకం ప్రకారం.. ఆడపిల్ల పుడితే రాష్ట్రం తల్లి బ్యాంకు ఖాతాలో రూ .2500 జమ చేస్తుంది. ఆ తర్వాత, బిడ్డకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు.. అమ్మాయి ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం రూ .1500 ఖాతాలో జమ చేస్తారు. ఉన్నత తరగతులకు గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు.. మొత్తం మూడు సంవత్సరాల గ్రాడ్యుయేషన్‌కు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అలాంటి పథకాలతో సంబంధం లేకుండా గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే.. తన సొంత డబ్బులను వాళ్ల అకౌంట్లలో రూ.5116 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని కరీంనరగ్ జిల్లా నుస్తులాపూర్‌ సర్పంచ్‌ రావుల రమేశ్‌ ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్లుగా భావించాలని పేర్కొన్నాడు. తల్లి, చెల్లి, భార్య ఆడవాళ్లే అయినప్పుడు పుట్టే బిడ్డ మాత్రం ఆడబిడ్డ కావొద్దని కోరుకోవడం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు. పంచాయతీ రికార్డుల్లోని జనన నమోదు రిజిస్టర్ లో రికార్డు అయిన వెంటనే రమేశ్ అన్న పేరిట... ఈ డబ్బులను డిపాజిట్ చేస్తామని.. సంబంధిత పత్రాలను తల్లిదండ్రులకు అందిస్తామని తెలిపారు. ఇలా డబ్బులను డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని దసరా పండగ నుంచి మొదలు పెడతామని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకున్న ఆ గ్రామ సర్పంచ్ ను గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అభినందించిన వారిలో తిమ్మాపూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఇందు, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్‌ మెంబర్‌ తాజొద్దీన్‌ ఉన్నారు. ఈ గ్రామంలో అతడు తీసుకున్న నిర్ణయాన్ని పక్క గ్రామాల ప్రజలు కూడా కొనియాడుతున్నారు. అతడి నిర్ణయం ఇతర సర్పంచ్ లకు ఆదర్శంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)