మీనాకు వీడ్కోలు పలికిన ఏపీ గవర్నర్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజ్ భవన్ ఏర్పాటు సమయంలో తొలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా ఎంతో శ్రమించి మంచి పనితీరుతో అనతి కాలంలోనే రాజ్ భవన్ ప్రాంగణానికి సర్వహంగులు సమకూర్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా, గవర్నర్ ఎడిసి ఎస్ వి మాధవరెడ్డి విజిలెన్స్ విభాగంలో అదనపు ఎస్పిగా బదిలీ అయిన నేపధ్యంలో గవర్నర్ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్ మాట్లాడుతూ.. ముఖేష్ కుమార్ మీనా విశ్వసనీయమైన, సమర్ధవంతమైన అధికారి అని, రాజ్ భవన్ వ్యవస్ధను తీర్చిదిద్దటంలో మంచి పనితీరును చూపారని, రోజువారీ కార్యాలయ వ్యవహారాలలో సైతం ఎప్పుడు ఎలాంటి అసౌకర్యం తనకు కలగలేదని అన్నారు. నూతన శాఖ విషయంలోనూ మీనాపై ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన భాధ్యతలను ఉంచిందని, అక్కడ కూడా విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం తనకుందని హరిచందన్ అన్నారు. అదే క్రమంలో వ్యక్తిగత భద్రత, అధికారిక కార్యక్రమాలతో సహా విభిన్న అంశాలను మాధవ రెడ్డి చాలా జాగ్రత్తగా నిర్వహించారని గవర్నర్ ప్రస్తుతించారు. మీనా, మాధవ రెడ్డిలు రాజ్ భవన్ ను వీడుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పగించిన అతి ముఖ్యమైన పనుల నిర్వహణకు వెళుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగానే తాను భావిస్తానని, వారిలో ఎవరికి ఏ సమయంలో ఆపద ఎదురైనా తగిన స్పందన కనబరచాలని తాను ఉన్నతాధికారులను ఆదేశిస్తూ ఉంటానని గవర్నర్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)