మహిళా విముక్తి - ఎంగెల్స్‌

Telugu Lo Computer
0


సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని ఎంగెల్స్‌ ముందుకు తెచ్చాడు. అందులో వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలని, దానితో పురుషాధిక్యతలో నడుస్తున్న కుటుంబ వ్యవస్థకి అంతం పలకవచ్చని చెపుతూ...ఉత్పత్తి శక్తులు సమాజ ఆస్తిగా మారడం దీనికి కీలకం అని తేల్చిచెప్పాడు. పరిసరాలు శుభ్రపర్చుకోవడం అనేది సమాజ పరం కావాలని, పిల్ల పెంపకం, చదువు కూడ సమాజ బాధ్యతగా ఏర్పడాలని, ఈ చర్యలే సోషలిస్టు ప్రత్యామ్నాయం అవుతాయని చెప్పాడు. మహిళా విముక్తి కోసం ఎంగెల్స్‌ తన రచనల ద్వారా అందించిన చారిత్రాత్మక అవగాహన కాలం గడిచినా పదును తగ్గలేదు. ఎంగెల్స్‌-మార్క్స్‌ ఉమ్మడిగా శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతం, దాని ఆచరణ గురించిన సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై వ్యవస్థీకృత వివక్ష, వారిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేసే పోరాటాలకిది వెలుగును అందిస్తుంది. అభిóవృద్ధి చెందిన ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో కూడా మహిళలపై వివక్ష, హింస కొత్త రూపాలలో కొనసాగుతున్నాయి. మహిళలు రెండో శ్రేణి మనుషులనీ, దానికి వారి శరీర నిర్మాణం, వారి మానిసిక స్థితే కారణం అనే పాలక వర్గాల తప్పుడు వాదనలను, కట్టుకథలను ఎంగెల్స్‌ బట్టబయలు చేశాడు. మత గ్రంథాలు కూడా మహిళలను రెండో శ్రేణి మనుషులుగానే చిత్రిస్తున్నాయని, వర్గ సమాజం లోని పాలక వర్గాలు శతాబ్దాల నుంచి ప్రచారం చేస్తున్నాయి. వాటి గుట్టును ఎంగెల్స్‌ బహిర్గతం చేశాడు.

మహిళలు - బాలకార్మికులు

    పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులను ఎలా దోపిడీ చేస్తారనే అంశాన్ని వివరిస్తూ తన 24వ ఏటనే ఎంగెల్స్‌ 'ఇంగ్లాండులో కార్మికవర్గం'పై ఒక ప్రామాణిక గ్రంథాన్ని రచించాడు. ఈ పుస్తకం కార్మికులను పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎలా దోపిడీ చేస్తారనే అంశాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ప్రత్యక్ష అనుభవం, ప్రభుత్వ పత్రాల అధ్యయనం అనే రెండు కోణాల నుంచి జరిగిన అధ్యయనం కావడంతో పెట్టుబడిదారీ దోపిడీ ఎంత క్రూరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు బట్టబయలు చేయగలిగాడు.

      ఇంగ్లండ్‌ లోని జౌళి, దుస్తులు, రెడీమేడ్‌ బట్టలు తయారు చేసే పరిశ్రమలలో మహిళలు, బాల కార్మికులను ఎలా ప్రవేశపెట్టారనే అంశంపై ఎంగెల్స్‌ ప్రత్యేక దృష్టి పెట్టి అధ్యయనం చేశాడు. దీనితోనే మహిళలు, బాల కార్మికులు ఎంత దారుణమైన పరిస్థితులలో పనిచేస్తున్నారనేది మొట్టమొదటిసారి ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది. పురుష కార్మికుల స్థానాన్ని యంత్రాలు ఎలా ఆక్రమిస్తున్నాయి అనేదానితో పాటు మహిళలను, బాల కార్మికులను పరిశ్రమలలో ఎలాంటి పనులలో ప్రవేశ పెడుతున్నారనేది ఈ అధ్యయనంలో తెలియ వచ్చింది. ఉత్పత్తి క్రమంలో ఉన్న ప్రతి ప్రక్రియను ఎంగెల్స్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వస్త్ర పరిశ్రమలో బట్టలు నేస్తున్నప్పుడు తెగిపోయిన దారాలను ముడి వేయాల్సిన పనికి కండబలం అవసరం లేదని, వేళ్ళు సున్నితంగా కదిలితే సరిపోతుందని, ఇలాంటి పనులలో పురుషులను తొలగించి మహిళలను, బాల కార్మికులను పెట్టుకుంటే తక్కువ ఖర్చుతో పని పూర్తిచేయవచ్చని గ్రహించాడు. దీని ఆధారంగా అధ్యయనం చేస్తే నూలు మిల్లులో 56 శాతం మంది మహిళలు ఉన్నారని, ఉన్ని మిల్లులో 69 శాతం, సిల్క్‌ మిల్లులో 70 శాతం మహిళా కార్మికులే ఉన్నారని, అందువల్లనే విపరీతమైన లాభాలు వస్తున్నాయని తెలియవచ్చింది.

    పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య దోపిడీ సంబంధాలు కేవలం పని స్థలాలలోనే ఉండవనీ, అవి కార్మికుడి జీవితం లోని అన్ని కోణాలనూ ప్రభావితం చేస్తున్నాయనీ యువకుడైన ఎంగెల్స్‌ గ్రహించాడు. అందుకే ఆయన అధ్యయనాన్ని ఇక్కడికే పరిమితం చేయలేదు. పెట్టుబడిదారీ పారిశ్రామికీకరణ అనేది విశాల ప్రాతిపదిక మీద కుటుంబ సంబంధాలను ఎలా ఛిద్రం చేస్తుందో, మహిళలు, బాల కార్మికులు ఎంత దారుణంగా బతుకులు ఈడుస్తుంటారో, కార్మిక కుటుంబాలు ఎలా విడిపోతాయో అర్ధం చేసుకున్నాడు. దీనికి దారుణమైన చట్టాలు ఎలా కారణం అవుతాయో కూడా గ్రహించాడు. తొలి రోజుల్లో ఆయన అధ్యయనం చేసిన కార్మిక కుటుంబాలు ఎలా ఉంటాయి అని అనుభవంతో నేర్చుకున్న విషయాలు తరువాత కాలంలో పెట్టుబడిదారీ కుటుంబ వ్యవస్థలో ఏర్పడిన కపటత్వాన్ని విమర్శించడానికి ఆయనకు ఉపయోగపడ్డాయి.

    మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని పురుష కార్మికులు వ్యతిరేకించేవారు. ఎందుకంటే వారి ఉద్యోగాలు పోతాయని. అయితే మార్క్స్‌, ఎంగెల్స్‌ మాత్రం అనేక సందర్భాలలో మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని సమర్థించారు. 1866లో కార్మిక సంఘం వారు వేతనంపై మహిళలను పనిచేయించడాన్ని నిషేధించాలని తీర్మానం ప్రవేశపెడితే మార్క్స్‌, ఎంగెల్స్‌ ఇద్దరూ దాన్ని వ్యతిరేకించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఇదే డిమాండ్‌ మళ్ళీ కొంతమంది ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు లేవనెత్తితే, 1885లో ఒక మిత్రుడికి ఎంగెల్స్‌ లేఖ రాస్తూ పురుషులకైనా, మహిళలకైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సోషలిస్టులు ఎవరైనా అంగీకరిస్తారని, మహిళా కార్మికులకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో తప్పనిసరి అని, అది వారి భౌతిక పరిస్థితుల వలన అవసరం అని తెలియచేశాడు.

మహిళలపై హింసకు పునాది

     ఎంగెల్స్‌కు ఆయన కాలంలోని సంఘ సంస్కర్తలకు ఉన్న మౌలిక వ్యత్యాసం ఏమిటంటే ఆయన వారిపై హింసకు ఉన్న కారణాల పునాదులపై కేంద్రీకరించి మహిళలను రెండవ తరగతి వాళ్ళగా చూపేందుకు ఉన్న భౌతిక పరిస్థితులు, కారణాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, సామాజిక పరిస్థితులను ఎలా మార్చాలి అనే వాటిని బట్టబయలు చేశారు. కుటుంబం వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగ యంత్రం పుట్టుక అనే పుస్తక రచన ఆయన ఈ కోణంపై దృష్టి సారించడానికి పురికొలిపింది. ఈ పుస్తకం మొదటి ముద్రణ 1884లో విడుదలైంది. మోర్గాన్‌ రాసిన ప్రాచీన పురాతన సమాజం అనే పుస్తకం, దానిపై మార్క్స్‌ రాసుకున్న నోట్స్‌ ఆధారంగా ఎంగెల్స్‌ వర్గం సమాజం అభివృద్ధి క్రమంలో మహిళలను ఏవిధంగా బానిసలుగా మారుస్తారనేది వివరించారు.

     కుటుంబ వ్యవస్థ పరిణామ క్రమంలో అనేక దశలు ఉన్నాయి. మొదట అందరు పురుషులకు అందరు మహిళలకు చెందినవారే అనే పద్ధతి నుంచి జంట పెళ్లి వచ్చింది. దీనికి సహజ ఎన్నిక పునాదిగా ఉంటుంది. సహజ ఎంపిక అనేది ప్రగతిశీలమైనది, సమాజం పురోగమనంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. అందుకని దీని స్థానంలో మరో విధానం ప్రస్తుతం అవసరం లేదు. కొత్త ఉత్పత్తి సంబంధాలు ఏర్పడేదాకా ఇవే కుటుంబ సంబంధాలు సరిపోతాయని ఎంగెల్స్‌ తెలియచేశాడు.

ఉత్పత్తి శక్తులు అభివృద్ధి అయి, సమాజ అవసరాలకు మించి మిగిలి అదనపు ఉత్పత్తి జరిగినప్పుడు సమాజ నిర్మాణంలో మౌలిక మార్పుకు అవసరం ఏర్పడి కొత్త సామాజిక సంబంధాలు అమలు లోకి వచ్చాయి. ఉత్పత్తి శక్తులు, అదనపు ఉత్పత్తి కొంత మంది మధ్యలోకి పోయినప్పుడు వర్గ వైరుధ్యం పుట్టింది. ఉమ్మడి సొత్తుగా ఉన్నది వ్యక్తుల సొంతం కావడంతో వ్యక్తిగత ఆస్తి పుట్టింది. ఈ సందర్భంలో సమాజంలో మహిళ స్థానంలో మార్పు జరిగింది. ఉత్పత్తి పరికరాలు పురుషుల సొంతం అయినాయి. దీనితో వారసత్వం అనేది కీలకంగా మారింది. అందుకని స్త్రీ ఎవరి సొంతం అయితే దానిని బట్టి వారి వారసత్వం నిర్ణయించబడేది. ఈ పురుషుడు ఏ స్త్రీ సంతానం అనేది కీలకంగా మారింది. వారిని పెంచడం, పోషించడం అనేది స్త్రీ మాత్రమే చేయగలదు. దానితో అనివార్యంగా భర్త పెత్తనం కింద స్త్రీ ఉండిపోయింది. స్త్రీని పురుషుడు చంపినా ఆయన తన హక్కును వినియోగించినట్టు భావించారని ఎంగెల్స్‌ తెలియచేశారు. ఏకపత్ని విధానం ఒక పద్ధతిగా ఏర్పడింది.
ఏకపత్ని విధానం అనేది ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఏర్పడిన కుటుంబ వ్యవస్థ. అంటే సొంత ఆస్తి అనేది ఉమ్మడి ఆస్తిపై పైచేయి సాధించిన తరువాత ఇది ఏర్పడిందని ఎంగెల్స్‌ అన్నాడు. సమాజ చరిత్రలో మొట్టమొదటి వర్గ వైరుధ్యం అనేది స్త్రీ పురుషుల మధ్య ఏర్పడింది. మొట్టమొదటి అణచివేత కూడా ఏకపత్ని కుటుంబ వ్యవస్థలోని స్త్రీని పురుషుడు అణచి ఉంచడంలో కనబడుతుంది. తల్లిగా ఏర్పడిన హక్కును తొలగించడంలో ప్రపంచ చరిత్రలో స్త్రీ మొదటి సారి ఓటమిపాలైంది అని ఎంగెల్స్‌ చెపుతాడు. వ్యక్తిగత ఆస్తి రద్దు అయినప్పుడే మహిళా విముక్తికి దారి తెరుచుకుంటుంది.
సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని ఎంగెల్స్‌ ముందుకు తెచ్చాడు. అందులో వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలని, దానితో పురుషాధిక్యతలో నడుస్తున్న కుటుంబ వ్యవస్థకి అంతం పలకవచ్చని చెపుతూ...ఉత్పత్తి శక్తులు సమాజ ఆస్తిగా మారడం దీనికి కీలకం అని తేల్చిచెప్పాడు. పరిసరాలు శుభ్రపర్చుకోవడం అనేది సమాజ పరం కావాలని, పిల్లల పెంపకం, చదువు కూడ సమాజ బాధ్యతగా ఏర్పడాలని, ఈ చర్యలే సోషలిస్టు ప్రత్యామ్నాయం అవుతాయని చెప్పాడు. రష్యాలో మొదటి సోషలిస్టు సమాజం ఏర్పడి, వీటిని ఆచరణలో పెట్టడంతో అది రుజువైంది.
ధనవంతుల కుటుంబాలలో పురుషుడు పెట్టుబడిదారుడు, స్త్రీ కార్మికురాలుగా భావించబడుతారు. స్త్రీని పని మనుషులలో పెద్ద పనిమనిషిగా మాత్రమే గుర్తిస్తారు. ఇక్కడే ఎంగెల్స్‌ ధనవంతుల కుటుంబాలకు, కార్మిక కుటుంబాలకు గల తేడాను చూపిస్తాడు. పెద్ద పరిశ్రమలు ఏర్పడటం స్త్రీని ఇంటి బైటికి పనిచేసేందుకు తీసుకు వచ్చింది. దానితో ఆమె కుటుంబ పోషకురాలిగా అవతరించింది. దీనితో పురుషాధిక్యతకి కాలం చెల్లినట్టు అయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం అయి సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటమే స్త్రీ విముక్తికి బాట వేస్తుందని రుజువైంది.
-బృందా కరత్

Post a Comment

0Comments

Post a Comment (0)