కిడ్నాప్ చేసి వారంపాటు చిత్రహింసలు

Telugu Lo Computer
0


డబ్బు లావాదేవీల గురించి మాట్లాడుకుందామంటూ ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి వారం పాటు చిత్రహింసలకు గురిచేసిన సంఘటన వనపర్తి జిల్లాలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వీపనగండ్ల మండలం సంపత్‌రావుపల్లి గ్రామానికి చెందిన మేకల చంద్రయ్య హైదరాబాద్‌లో స్థిరపడి జీహెచ్‌ఎంసీలో తాగునీటి ట్యాంకర్‌ గుత్తేదారుగా పనిచేస్తున్నాడు. ట్యాంకర్‌ డ్రైవర్‌గా సరూర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ను నియమించుకున్నాడు. అనంతరం శ్రీకాంత్‌ కూడా కొత్త ట్యాంకర్‌ను కొనుగోలు చేసి జీహెచ్‌ఎంసీకి కాంట్రాక్టు తిప్పేవాడు. డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో శ్రీకాంత్‌ తనకు రూ. 3.50 కోట్లు ఇవ్వాల్సి ఉందని అతడితో చంద్రయ్య గొడవ పడ్డాడు. డబ్బు విషయమై మాట్లాడుకుందామంటూ చంద్రయ్య తన కారులో శ్రీకాంత్‌ను ఈ నెల 11న సంపత్‌రావుపల్లికి తీసుకొచ్చాడు. అనంతరం 12న నీ భర్త రమ్మన్నాడంటూ శ్రీకాంత్‌ భార్య అనిత, పిల్లలు శివాణి, నెలరోజుల పసికందు వెంకటేశ్‌ను సైతం తీసుకొచ్చి వారం రోజులు ఇంట్లో నిర్బంధించాడు. హైదరాబాద్‌ నుంచి కిరాయి మనుషులను రప్పించి, భార్యాభర్తలను కర్రలతో కొట్టించాడు. ఒంటిపై వాతలు పెట్టి కారం చల్లుతూ హింసించారు. నెల రోజుల బాలింత అని చూడకుండా తన భార్యను కూడా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితుడు శ్రీకాంత్‌ తెలిపాడు. మంగళవారం రాత్రి బాధితుల అరుపులు విన్న గ్రామస్థులు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి పోలీసులు వెళ్లేసరికి నిందితుడు చంద్రయ్య పరారయ్యాడు. హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ వివిధ గ్రామాల ప్రజల నుంచి చంద్రయ్య, శ్రీకాంత్‌లు డబ్బు వసూలు చేశారని, ఆ గొడవే కిడ్నాప్‌కు కారణం కావచ్చనే అనుమానముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)