వ్యాకరణము అవసరమా ?

Telugu Lo Computer
0


వ్యాకరణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే శ్లోకాలు ఒక రెండు ఉదహరిస్తాను:

"యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్

స్వజనః శ్వజనోమాభూత్ సకలం శకలం సకృత్ శకృత్ "

ఒక తండ్రి కొడుకుతో అంటున్నాడు. 'నాయనా నువ్వు పెద్ద చదువులు చదువుకోక పోయినా ఫరవాలేదు. కానీ వ్యాకరణం మాత్రం చదువుకో. ఎందుకంటే స్వజనం (బంధువులు) అనడానికి శ్వజనం (కుక్కలు) అనీ, సకలం (మొత్తం) అనడానికి శకలం (ముక్క) అనీ, సకృత్ ( ఒకప్పుడు ) అనడానికి శకృత్ (మలం) అనీ అనకుండా ఉంటావు.'

మరొక శ్లోకం--

"అవ్యాకరణమధీతం భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణమ్

ఔషధమపథ్యయుక్తం త్రయమిదమకృతం వరం నకృతమ్ "

'వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవడం, చిల్లులు పడిన పడవలో నదిని దాటడం, పథ్యం లేకుండా ఔషధం పుచ్చుకోవడం, ఈ మూడూ వృథా ప్రయాసలే. అవి చేయడం కన్నా చేయకపోవడమే మంచిది.'

పై రెండు శ్లోకాలు వ్యాకరణం యొక్క ప్రముఖతను స్పష్టంగానే చెబుతున్నాయి. మనకు వ్యాకరణం అంటే ఏమిటో సరియైన అవగాహన లేక పోవడం, ముఖ్యంగా తెలుగులో సంస్కృతం నుండి పట్టుకొచ్చిన ముక్కలతో అతుకుల బొంతలాగా తయారు చేసిన వ్యాకరణాలు ఉండడం, ఇక మనకు తెలిసిన ఆంగ్ల భాష వ్యాకరణం దినదినమూ మారే ఆ భాషను ప్రామాణీకరించలేక పోవడం... ఇవన్నీ మనకు వ్యాకరణం పట్ల ఉన్న చిన్న చూపుకు కారణాలు. ఒక అక్షరం ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చో, ఆ ఉచ్చారణ ఎప్పుడు ఎలా మారుతుందో అన్న దగ్గర ప్రారంభించి, భాషలో ప్రతి పదం యొక్క ఉత్పత్తిని, మార్పును ఖచ్చితంగా నిర్వచించే సంస్కృత వ్యాకరణాన్ని చదివినప్పుడు వ్యాకరణ శాస్త్రం యొక్క ఉపయోగం, ముఖ్యత్వం తెలుస్తాయి. సంస్కృతానికే కాక, తమిళ భాషకు, లాటిన్, గ్రీకు, స్పానిష్, ఇటాలియన్, రష్యన్, అరబిక్, ఫార్సీ వంటి అనేక భాషలకు విపులమైన, విశదమైన వ్యాకరణాలు ఉన్నాయి.

కంప్యూటర్లు వ్యాకరణంలో తప్పులు దిద్దుతున్న మాట నిజమే అయినా కంప్యూటరుకు వ్యాకరణం నేర్పడానికి కొందరుండాలి కదా. అనేక సార్లు  సరిగ్గా వ్రాసిన వాక్యాలు కంప్యూటరు తప్పుగా గుర్తించి, అదొక తప్పుడు సవరణను సూచిస్తుంటుంది.

ఒక కథలో పిల్లలు అందరూ కాల్క్యులేటర్లు వాడే రోజులు వచ్చిన తరువాత అందరూ 2 + 2 = 4 అని వ్రాస్తుంటే ఒక పిల్లవాడు 2 X 2 కూడా నాలుగే అని చూపుతాడు. అది చూసి టీచరుతో సహా అందరూ ఆశ్చర్యపోయి అతని మేధాశక్తిని మెచ్చుకొంటారు.య కొంత కాలానికి వ్యాకరణం విషయంలో కూడా అదే జరుగవచ్చు.

అందుకే మనం పిల్లలకు వ్యాకరణం నేర్పాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)