వింత ఆచారం !

Telugu Lo Computer
0


 


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెండ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. అంటే ప్యాంటు, షర్టు వేస్తారు. అదే ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెండ్లయితే అమ్మాయిగా అలంకరిస్తారు. అంటే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలతో అలంకరిస్తారు. పెండ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. వధూవరులను బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు.
ఈ ఆచారానికి ఓ కథను సైతం ఆ గ్రామస్తులు చెబుతున్నారు. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడని, ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోయారని చెబుతారు. దాంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారంటారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారని, పెండ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారని పలువురు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోందట.!

Post a Comment

0Comments

Post a Comment (0)