హేమ‌సుంద‌ర్ మైండ్ బ్లాక్‌!

Telugu Lo Computer
0

 

విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తారక‌రామారావు ద్విపాత్రాభిన‌యం చేసిన సినిమా 'ప్రేమ‌సింహాస‌నం' (1981). బీరం మ‌స్తాన్‌రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తాత‌య్య‌గా హేమ‌సుంద‌ర్ న‌టించారు. ఎన్టీఆర్‌తో ఆయ‌న న‌టించ‌డం అదే తొలిసారి. అంత‌టి మ‌హాన‌టుడికి తాత వేషం ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు హేమ‌సుంద‌ర్ చాలా సంతోషించారు. అంతలోనే సిగ్గు కూడా వేసింది.. అంత‌టి న‌టుడికి తాను తాత వేషం వేయ‌ట‌మా!.. అని.

చెన్నైలోని భ‌ర‌ణీ స్టూడియోలో షూటింగ్‌.. ఇంటి ద‌గ్గ‌రే మేక‌ప్ వేసుకొని లొకేష‌న్‌కు వ‌చ్చారు ఎన్టీఆర్‌. ఆయ‌న కారుదిగి వ‌స్తుంటే.. అక్క‌డున్న వాళ్లు ఒక్కొక్క‌రుగా ఆయ‌న‌కు పాదాభివంద‌నాలు చేస్తున్నారు. పాదాభివంద‌నాలు చేయ‌డం అంటే హేమ‌సుంద‌ర్‌కు గిట్ట‌దు. అందుక‌ని నెమ్మ‌దిగా లోప‌లికి జారుకున్నారు. షూటింగ్ మొద‌లైంది. హేమ‌సుంద‌ర్‌కు అది తొలి సీన్‌. ఎన్టీఆర్‌కు ఆయ‌న‌ను ప‌రిచ‌యం చేశారు డైరెక్ట‌ర్ మ‌స్తాన్‌రావు. ప‌ర‌స్ప‌రం న‌మ‌స్కారాలు చేసుకున్నారు. డైరెక్ట‌ర్ సీన్ వివ‌రించ‌గానే, "ఓకే టేక్" అన్నారు ఎన్టీఆర్‌. ఒక్క రిహార్స‌ల్ అయినా చేస్తారేమో అనుకున్నారు హేమ‌సుంద‌ర్‌. డైరెక్టుగా టేక్ అనేస‌రికి ఆయ‌న‌కు కాస్త కంగారు వేసింది. డైరెక్ట‌ర్‌తో ఒక రిహార్స‌ల్ పెట్టించ‌మ‌ని అడిగారు. "సార్‌.. అత‌ని కోసం ఒక రిహార్స‌ల్" అని చెప్పారు డైరెక్ట‌ర్‌. "ఓకే.. ఓకే" అన్నారు ఎన్టీఆర్‌. ఆ సీన్‌.. ఎన్టీఆర్ ఫారిన్‌లో ఒక మ్యూజిక్ కాన్స‌ర్ట్ చేసి అప్పుడే ఇంటికి వ‌స్తారు. వ‌చ్చీ రాగానే "తాతా.. తాతా" అని పిలుస్తూ, తాత రాగానే త‌న చేతిలోని బ్రీఫ్‌కేస్ ఓపెన్ చేసి, అందులోంచి మెడిసిన్స్ తీసి ఆయ‌న చేతికి ఇస్తారు. ఇద్ద‌రి మ‌ధ్యా ఒక‌ట్రెండు మాట‌లు న‌డుస్తాయి. రిహార్స‌ల్ అయిపోయింది. టేక్ స్టార్ట‌య్యింది. ఎన్టీఆర్ ఇంట్లోకి "తాతా.. తాతా" అంటూ ఎంట‌రై కుడిచేతిలోని బ్రీఫ్‌కేసును పైకెగ‌రేసి ఎడ‌మ‌చేత్తో దాన్ని ప‌ట్టుకొని, ఠ‌క్కుమ‌ని వ‌చ్చి తాత పాత్ర‌ధారి హేమ‌సుంద‌ర్‌కు పాదాభివంద‌నం చేశారు. అంతే! హేమ‌సుంద‌ర్ మైండ్ బ్లాకైపోయింది. ఒక్క నిమిషం ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. రిహార్స‌ల్స్ చేసిన‌ప్పుడు ఆ పాదాభివంద‌నం లేదు. కానీ టేక్‌లో ఎన్టీఆర్ ఆ ప‌ని చేశారు. మొత్తానికి ఎలాగో ఆ సీన్ మేనేజ్ చేశారు హేమ‌సుంద‌ర్‌. డైరెక్ట‌ర్ "క‌ట్‌.. ఓకే" అన్నారు. ఇప్ప‌టికీ ఆ ఘ‌ట‌న‌ను మ‌ర్చిపోలేదు హేమ‌సుంద‌ర్‌.

Post a Comment

0Comments

Post a Comment (0)