తొలి కులాంతర వివాహం మాదే ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 13 July 2021

తొలి కులాంతర వివాహం మాదే !


ఆంధ్రా అమ్మాయి గుత్తా భారతీ దేవి, తెలంగాణ అబ్బాయి అరిగె భాస్కరరావు. 75 ఏళ్ల కిందట ఒక్కటయ్యారు. అదీ కులాంతర వివాహంతో. వీరి పెళ్లి తెలుగునేల సామాజిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఆనాడు అదొక పెద్ద సంచలనం కూడా. భారతి మరెవరో కాదు, ప్రముఖ సంఘసంస్కర్త అరిగె రామస్వామి కోడలు. నాస్తికోద్యమానికి అంకితమైన గుత్తావారి ఇంటి ఆడపడుచు. కులరహిత సమాజాన్ని కాంక్షిస్తున్న 91 ఏళ్ల భారతీదేవి తన జీవిత విశేషాలను నవ్యతో పంచుకున్నారు. 

‘‘ఈ కాలం తల్లితండ్రులు మా అమ్మ,నాన్నల నుంచి చాలా నేర్చుకోవాలి. అవును మరి! వాళ్లు 75ఏళ్ల కిందటే నాకు కులాంతర వివాహం చేశారంటే, గొప్ప విషయమే కదా.! ఆనాడు అదొక పెద్ద సంచలనం. ఆంధ్రాలో మాదే తొలి కులాంతర వివాహం అనుకుంటా.! నా పెళ్లి కథకన్నా ముందు మా పుట్టింటి సంగతి కొంత చెప్పాలి. మా సొంతూరు గుంటూరు జిల్లాలోని గుత్తావారి పాలెం. మా నాన్నవాళ్లు ఆరుగురు అన్నదమ్ములు. మా పెదనాన్న గుత్తా చలమయ్య ఆధ్యాత్మికవాది. తక్కినవారంతా నాస్తికులే. మా నాన్న రామాంజయ్య గాంధేయవాది. నేను పుట్టిన ఏడాదే ఆయన ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లాడు. మా చిన్నాన్నలు, వీరరాఘవయ్య చౌదరి, సుబ్రహ్మణ్యంలు కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని చాలాసార్లు అరెస్టు అయ్యారు. వీళ్లతో పాటు మా శ్రీనివాసరావు, రాధాకృష్ణ బాబాయిలు హేతువాద, నాస్తికోద్యమాల్లో కీలకంగా పనిచేసేవాళ్లు. ఆచార్య ఎన్జీరంగా, గోరా వంటి గొప్పవ్యక్తుల రాకపోకలతో ఆనాటి మా ఇల్లు ఒక ఉద్యమ కేంద్రాన్ని తలపించేది. నాకు ‘భారతి’ అని పేరుపెట్టింది కూడా ఎన్జీరంగా సతీమణే.! మా ఇంటి వరండాలోని బల్లమీద రోజూ ఉదయం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే మా పెదనాన్నకు, నాస్తికులైన మా నాన్న, చిన్నాన్నలకు మధ్య వాదోపవాదనలు జరుగుతుండేవి. స్వరాజ్యం కోసం మళ్లీ వారంతా ఒక్కటయ్యేవాళ్లు.

మా చలమయ్య పెదనాన్న, ప్రముఖ హరిజనోద్యమనాయకుడు అరిగె రామస్వామి మంచి స్నేహితులు. పేరు జ్ఞాపకం లేదు కానీ, ఏదో ఒక ఆధ్యాత్మిక పీఠం వద్ద ఒకరికొకరు పరిచయం. ఒకసారి వారిద్దరూ పచ్చల తాడిపర్రులోని ఒక ఆధ్యాత్మిక గురువు మందిరానికి వెళ్లినప్పుడు, మాటల మధ్యలో కులాంతర వివాహాల మీద ప్రస్తావన వచ్చిందట. ఆ సందర్భంగా ‘మీ ఇరు కుటుంబాలు వియ్యమందుకోవచ్చు కదా’ అని అక్కడివారెవరో అన్నారట. అందుకు ఇద్దరూ సంతోషంగా అంగీకరించారు. మా పెదనాన్న నిర్ణయాన్ని మిగతా కుటుంబ సభ్యులూ సమర్థించారు. అలా ఒకరోజు నన్ను చూడటానికి సికింద్రాబాద్‌ నుంచి పెళ్లికొడుకు భాస్కరరావుతో పాటు డెభ్భైమంది పరివారం మా ఊరొచ్చారు.(నవ్వుతూ...) అప్పుడు నా వయసు పదహారేళ్లు. పెద్దగా చదువుకోని నాకు మా పెద్దల మాటంటే గౌరవం.  

ఇరు కుటుంబాల సమక్షంలో గుత్తావారిపాలెంలో 1947, ఏప్రిల్‌14న ప్రముఖ సంఘసంస్కర్త గోరా గారి చేతుల మీదుగా అరిగె భాస్కరరావుతో నా పెళ్లి జరిగింది. మాది స్టేజీ మ్యారేజీనే. అందులో తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం వంటి తంతులేమీ లేవు. మమ్మల్ని దీవించడానికి కొండా వెంకటప్పయ్య, వావిలాల గోపాలకృష్ణ, ఎన్జీరంగా వంటి అతిరథమహారథులంతా వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదిస్తూ మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ తదితర జాతీయ నాయకులంతా ఉత్తరాలు రాశారు. 

తల్లిదండ్రుల చాటుబిడ్డగా పెరిగిన నన్ను మా మామయ్య అరిగె రామస్వామి కన్నకూతురికంటే మిన్నగా చూసుకున్నారు. ఇంటి, వంట పనులు రాని నాకు ఆయనే దగ్గరుండి మరీ వంట చేయడం నేర్పించారు. నా భర్త భాస్కరరావు నన్నెంత ప్రేమగా చూసేవారో మాటల్లో చెప్పలేను. తనకు నేనంటే ప్రాణం. ఎన్నడూ నన్ను పల్లెత్తుమాట అనెరగడు. ఆయన ఆర్టీసీలో పనిచేస్తున్న రోజుల్లో మేము జమీస్తాన్‌పూర్‌లోని క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. మాకు ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్లకూ కులాంతరవివాహాలే చేశాం. ఇప్పుడు వాళ్ల పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. నా భర్త చనిపోయి పదహారేళ్లు అవుతుంది. ఇన్నేళ్లు గడిచినా ఆయన పదవీ విరమణ అనంతరం రావాల్సిన డబ్బు ఇంతవరకు ఆర్టీసీ మాకు చెల్లించలేదు. 

ప్రస్తుతం కుమ్మరిగూడలో మేముంటున్న ఇల్లుతప్ప మామయ్యకు మరేమీ ఆస్తిపాస్తులు లేవు. అదీ తాను రాజకీయాల్లోకి రాకముందే కట్టుకున్నారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. అయినా, రామస్వామి గారు చనిపోయే రోజున తన బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వ సొమ్ము ఏడు రూపాయలు మాత్రమే. చివరి వరకూ నీతి, నిజాయతీలతో బతికారు. అలాంటి మహనీయుడి కోడలిగా గర్వపడుతున్నా. మామయ్య పేరు, పలుకుబడిని నా భర్తకూడా ఎన్నడూ తన స్వప్రయోజనాల కోసం వాడలేదు. 

నా జీవితంలో ఒకే ఒక్కసారి గుండెలు పిండేసేంతటి బాధ ఎదురైంది. సికింద్రాబాద్‌లోనే, ఒకరోజు నీళ్ల కోసం బావి వద్దకెళ్లినప్పుడు కడుపుతో ఉన్న ఒక గిరిజన మహిళ బిందె ఎత్తుకోడానికి అవస్థపడుతుండటం చూశా. సర్లే! సాయం చేద్దామని నేను బిందెమీద చేయి వేయబోతే, ఆమె చటుక్కున పక్కకు జరిగి నన్ను తాకనివ్వలేదు. అప్పుడు మాత్రం నాకు దుఃఖం ఆగలేదు. ఆ సంఘటన నన్ను చాలారోజులు వెంటాడింది. 

ఇప్పుడు నా వయసు 91ఏళ్లు. చూపుబాగా తగ్గిపోయింది. కీళ్లవాతం అప్పుడప్పుడు బాధపెడుతుంటుంది. అంతకు మించి మరేమీ ఆరోగ్యసమస్యలు లేవు. నా ఒక్కగానొక్క కొడుకు పదేళ్ల కిందట చనిపోయాడు. నా కూతుళ్లు, కోడలు నన్ను బాగా చూసుకుంటారు. ఇద్దరు కూతుళ్లు నాతోనే ఉంటారు. మా కోసమే వాళ్లిద్దరూ పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. వాళ్లు ఒకవైపు నన్ను కనిపెట్టుకుంటూ, ఇంట్లోనే స్వగృహఫుడ్స్‌ నడుపుతున్నారు. ఆస్తిపాస్తులు లేవని దిగులులేదు. అంతకుమించి మంచి మనసున్న అల్లుళ్లు, మనుమలు నాకున్నారు. నా జీవితంలో ఒంటరితనమనేదే లేదు. మా ఇల్లు ఎప్పుడూ నలుగురితో కళకళలాడుతుంటుంది. కనుకే  ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. 

నిజాం రాచరికానికి వ్యతిరేకంగా మా మామయ్య పెద్ద ఎత్తున పోరాడుతున్న కాలమది. ఆంధ్ర మహాసభలోనూ ఆయన యాక్టీవ్‌గా ఉండేవారు. ఆ కోపంతో రజాకార్లు ఒకరోజు కుమ్మరిగూడలోని మా ఇంటిపై దాడికొచ్చారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మామయ్య ఇంటి వెనుక నుంచి పారిపోయి, సికింద్రాబాద్‌లో రైలెక్కి గుత్తావారి పాలెం వచ్చారు. దాడుల భయంతోనే అంతకుముందు నేను, మా ఆయన అక్కడికి చేరుకున్నాం. మేమంతా కలిసి మా పుట్టింట్లో కొంతకాలం తలదాచుకున్నాం.

No comments:

Post a Comment